07-09-2025 12:55:17 AM
నకిరేకల్, విజయక్రాంతి; నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం చెర్వు అన్నారం గ్రామానికి చెందిన దెందె సుష్మిత, ప్రవీణ్ దంపతులు తమ నాలుగు మాసాల రియాన్షీని ఆడించడం కోసం తల్లి వివిధ రకాల కూరగాయలు, జంతువులు, జాతీయ నాయకుల ఫొటోలు, వివిధ రకాల పండ్లు, పలు దేశాల పతకాలను చూపిస్తూ, వాటి పేర్లు చెప్పేవారు. ఈ క్రమంలో తల్లి కొన్ని పేర్లు చెప్పగానే వాటికి సంబంధించి వస్తువులను రియాన్షీ పట్టుకునేది.
పాపకు ఉన్న జ్ఞాపకశక్తిని గుర్తించి వారి మరిన్ని కొత్తరకం బొమ్మలను చూపిస్తూ.. వీడియోలు తీసి మిత్రులకు పంపేవారు. వారి సూచన మేరకు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోలను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నిర్వాహకులకు పంపారు. వీడియోలు చూసిన నిర్వాహకులు రియాన్షీని ‘సూపర్ టాలెంటెడ్ కిడ్’గా గుర్తించి అవార్డుతో పాటు మెడల్ అందజేశారు. ప్రస్తుతం పాప రియాన్షీ వయస్సు 23 నెలలు. కనీసం మాటలు కూడా పూర్తి స్థాయిలో రాని స్థాయిలో నాలుగేండ్ల వయసు పిల్లలు చదవాల్సిన క్లామ్ జాయ్ బుక్స్‌లోని 20 రకాల క్యాటగిరీలకు 360 ఫ్లాష్ కార్డులను గుర్తుపట్టేస్తుంది.
సుస్మిత గర్భవతిగా ఉన్నప్పుడు..
‘నాకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు బాగుండాలని నిరంతరం ఆలోచించే దాన్ని. నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి పాజిటివ్ థింకింగ్‌తో ఆలోచిస్తే పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది..అనే విషయాలను యూట్యూబ్లో వందల కొద్ది వీడియోలు చూసేదాన్ని. డాక్టర్ల సలహాలు, ఇతర పిల్లల టాలెంట్ వీడియోలు చూసేదాన్ని. డెలివరీ సమయంలో నాకు కావాల్సిన మెటీరియల్ అంతా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నా’ అని రియాన్షీ తల్లి సుస్మిత చెబుతున్నారు.
తల్లి ప్రయత్నంతో భవితకు బాటలు
రియాన్షీతల్లి సుష్మిత తనకున్న విద్యా పరిజ్ఞానం, సమాజం పట్ల అవగాహన, పిల్లల పట్ల జాగ్రత్త, ముందుచూపు, వారి పాప భవిష్యత్తుకు బాటలు వేశారు. పాప మూడు నెలల వయసులో ఉన్నప్పుడే ఆమెలోని అద్భుత గ్రహణశక్తిని గుర్తించింది. ఆ గ్రహణ శక్తిని మరింత పెంపొందించేందుకు వివిధ రకాల ఫ్లాష్ కార్డ్స్‌తో మరింత సానబెట్టింది. ఎలాగైనా తమ పాప ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలని ఫ్లాష్‌కార్డుల గుర్తింపులో రియాన్షీచూపుతున్న ప్రతిభను వీడియోలుగా చిత్రికరించి గిన్నిస్ బుక్ ఇంటర్నేషనల్ రికార్డ్స్, సూపర్ టాలెంట్ కిడ్ పోటీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సూపర్ టాలెంటెడ్ కిడ్‌గా ఆ చిన్నారికి గుర్తింపు లభించింది. నోబుల్ వరల్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఇంటర్నేషనల్ రికార్డ్స్‌కు కూడా రియాన్షీ అర్హత సాధించింది. పలు అవార్డులను సొంతం చేసుకోవ డం విశేషం. దీంంతో తల్లిదండ్రులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. త మ పాప మూడు నెలల వయసులోనే ఇంత టి ప్రతిభను చూపటం ఆనందంగా ఉందంటున్నారు. పాపకు భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకొనే దిశగా శిక్షణ ఇప్పిస్తామని తల్లి సుష్మిత పేర్కొన్నారు.
టాలెంట్ ఎవరి సొత్తూకాదు..
ప్రతిభకు వయసు, అనుభవంతో సంబంధం లేదు. టాలెంట్ ఎవరు సొత్తు కాదు అని చిన్నారి రియాన్షీ రుజువు చేసింది. ఐదు నెలల వయసులోనే అద్భుతాలు సృష్టించింది. వరల్డ్ టాలెంట్ కిడ్‌గా, లైవ్ నోబెల్ అవార్డులను సొంతం చేసుకుంది. పిల్లల్లో దాగి ఉన్న నిగూఢ శక్తిని వెలికి తీస్తే ప్రతీఒక్కరూ చిచ్చరపిడుగులే.
పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. ఈ పాప ప్రతిభను ఎవరైనా ఫిదా అవ్వల్సిందే. ఐదు నెలల వయసులోనే అద్భుతాలు సృష్టిస్తోందీ సిసింద్రీ. అమ్మానాన్నలను గుర్తుపట్టాల్సిన వయసులో ఎన్నో వస్తువులను గుర్తిస్తూ రికార్డులను సొంతం చేసుకుంది. పువ్వుపుట్టగానే పరిమళించినట్టు నల్లగొండ జిల్లాకు చెందిన రియాన్షీ తన టాలెంట్‌తో ఔరా అనిపిస్తోంది.