calender_icon.png 21 May, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదేళ్లునా ముందుకు సాగని నిర్మాణ పనులు

21-05-2025 12:20:48 AM

  1. మేయర్ హామీ ఇచ్చినా పూర్తికాని కమ్యూనిటీ హాల్

ప్లాస్టిక్, చెక్కలతో అధ్వానంగా మారిన ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ ఆవరణ స్థలం

ముషీరాబాద్, మే 20 (విజయక్రాంతి) : భోలక్ పూర్ డివిజన్ ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ఐడేళ్లయినా పూర్తికాడం లేదు. నగర మేయర్ కమ్యూనిటీ హాల్ ను సందర్శించి వెంటనే నిధులు విడుదల చేసి నిర్మాణ పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ముందుకు సాగని నిర్మాణ పనులు. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఇందిరా నగర్ వాసులు పలు మార్లు ఫిర్యాదు చేసినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ పరిస్థితి మారింది.

ఇందిరానగర్ ఫస్ట్ వెంచర్లో కమ్యూనిటీ హాల్‌కు 2000లో శంకుస్థాపన..

భోలక్ పూర్ డివిజన్ ఇందిరానగర్ ఫన్డ్ వెంచర్లో 2020 ఫిబ్రవరి 15న 200ల గజాల స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.18.10 లక్షలు మంజూరు చేశారు. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దివంగత మాజీ హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే ముఠాగోపాల్ తదితరులు హాజరై శంకుస్థాపన చేశారు. ఆనాటి నుంచి నేటివరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు కేవలం స్లాబ్, గోడలకే పరిమితమయ్యాయి.

మేయర్ హామీ ఇచ్చినా ముందుకు సాగని పనులు

నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు ఇందిరానగర్ కమ్యూనిటీ హాలు జనవరి 8 న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ గౌస్టద్దీన్లో కలిసి సందర్శించారు. కమ్యూనిటీ హాల్ పరిస్థితిని చూసి నిధులు వెంటనే విడుదల చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్థానిక ప్రజలకు మేయర్ హామీ ఇచ్చారు. కానీ నేటివరకు నిర్మాణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగడంలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్క్రాప్‌కు నిలయంగా మారిన కమ్యూనిటీ హాల్ ఆవరణ స్థలం..

ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో స్థానిక వ్యాపారులు కమ్యూనిటీ హాల్ ఆవరణలో ప్లాస్టిక్ స్క్రాబ్, ప్లైవుడ్ చెక్కలను నిల్వ చేస్తున్నారు. కొంత మం ది వ్యాపారులు తమ వాహనాలను పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్నారు. దీనితో కమ్యూనిటీ హాల్ ఆవరణ స్థలం ఆపరిశుభ్ర వాతావరణం నెలకొంది. స్థానికులు వాహనదారులకు, ఈ స్క్రాబ్ నిల్వచేసేవారికి సూచించినా పట్టించుకోకుండా గొడవలకు దిగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కమ్యూనిటీ నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు కృషి

ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. స్థానికులు సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా నిధులు విడుదల చేయిస్తాం.
                                                                                                                                                                                                                      గోపాల్, ఎమ్మెల్యే

ప్లాస్టిక్ స్క్రాబ్, వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారిన స్థలం

కమ్యూనిటీ ఆవరణ స్థలం చెత్తకుప్పలు, ప్లాస్టీక్ స్క్రాప్ నిల్వలకు అడ్డాగా మారింది. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రత వాతావరణం నెలకొన్నాయి. కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.
                                                                                                                                                                                                        కనకేష్ కుమార్, స్థానికుడు

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం

కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమీషనర్ కర్షన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలను కలిసి వినతి పత్రం అందజేశాం. నగర మేయరు సైతం పిర్యాదు చేశాం. అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు. నిధులు విడుదల చేయాలని కోరాం. త్వరగా పనులు పూర్తి చేసి స్థానిక ప్రజలకు కమ్యూనిటీ హాల్ను అందుబాటులోకి తీసుకురావాలి.
- నందగిరి నర్సింహ,స్థానిక బస్తీ నాయకుడు