18-09-2025 12:15:09 AM
‘కోర్ట్’ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇద్దరూ ఓ అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ కాంబోను బ్లాక్‌బస్టర్ రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తుండగా.. శివరాజు ప్రణవ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో సతీశ్ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్టును మేకర్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్ విడుద చేశారు. ఈ చిత్రానికి ‘బ్యాండ్ మేళం’ అని టైటిల్‌ను పెట్టారు. ‘ఎవ్రీ బీట్ హ్యాజ్ యాన్ ఎమోషన్’ అనేది ఉప శీర్షిక. ఫస్ట్ బీట్ పేరుతో రిలీజ్ చేసిన ఈ టైటిల్ గ్లింప్స్.. తెలంగాణ యాసలో విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఓ జానపద గీతంతో ప్రారంభమైంది. నాయకానాయికలు యాదగిరి, రాజమ్మ మధ్య తెలంగాణ యాసలో జరిగే సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సీనియర్ నటుడు సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; గీత సాహిత్యం: చంద్రబోస్; డీవోపీ: సతీశ్ ముత్యాల; ఆర్ట్: శ్రీనివాస్ నార్ని; స్క్రీన్ ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు; నిర్మాతలు: కావ్య, శ్రావ్య; రచన, దర్శకత్వం: సతీశ్ జవ్వాజీ.