14-11-2025 12:43:04 AM
అగ్ని గుండాల కార్యక్రమం వీక్షించిన ఎమ్మెల్యే
చిన్ననాటి నుండి రామారెడ్డి తో నాకు అనుబంధం ఉంది
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): ఓం ఓం భైరవ ఓం కాలభైరవ అంటూ భక్తులు పెద్ద ఎత్తున కాలభైరవ స్వామి ఉత్సవాలలో రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం రామరెడ్డి, ఇస్సన్నపల్లి గ్రామాల మధ్యన వెలసిన కాలభైరవ స్వామి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో నిర్వహిస్తారు. దాంట్లో భాగంగా రథోత్సవం, అగ్నిగుండాలు, స్వామివారి డోలారోహణం, కార్యక్రమాలను కాలభైరవ స్వామి ఆలయ ఆవరణలో నిర్వహించారు.
పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలకు ముంబాయి, మహారాష్ట్ర, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, మెదక్ , హైదరా బాద్. జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు రథోత్సవాన్ని లాగుతూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, రామారెడ్డి, ఇసన్నపల్లి , రెడ్డిపేట్, మద్దికుంట, చుట్టుపక్కల గ్రామస్తుల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేద పండితులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు.
తన బాల్యం కాలభైరవ స్వామి ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో తిరిగినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్ ను ఘనంగా సన్మానించారు.