calender_icon.png 8 September, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో కాంట్రాక్టర్ మృతి

07-09-2025 12:42:56 AM

  1. మృతుడు ఇల్లందు మున్సిపల్ మాజీ చైర్మన్ డీవీకి దగ్గరి బంధువు
  2. ఆర్థిక వివాదాలతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువుల ఆరోపణ
  3. డీవీ ఇంటి ముందు మృతుడి కుటుంబీకుల ఆందోళన

ఇల్లందు టౌన్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మెట్లగూడెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ గడపర్తి శ్రీనివాస్(౫౦) శుక్రవారం రాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. శ్రీనివాస్ ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో పలు కాంట్రాక్టర్ పనులు నిర్వహించేవాడు. ఇతను ఇల్లందు మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు (డీవీ)కి దగ్గర బంధువు. వీరి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాల నేపథ్యంలో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువుల ఆరోపిస్తున్నారు.

గతంలో పలువురు పెద్దమనుషుల సమక్షంలో ఇరువురి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లెక్కలు చేసినప్పటికీ శ్రీనివాస్ కు అన్యాయం జరిగినట్లు బంధువులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ  క్రమంలో శుక్రవారం సైతం పెద్దల సమక్షంలో సమస్య పరిష్కరించగా శ్రీనివాస్ తనకు అన్యాయం జరిగిందని ఆవేదనకు గురయ్యారు.

దీంతో శ్రీనివాస్ ముట్లగూడెంలోని తన వ్యవసాయ భూమి వద్ద కారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటికి తీసుకువెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగా మృతుడి కుటుంబ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ కారును పలు వస్తువులను ధ్వంసం చేశారు. 

శ్రీనివాస్ మృతికి డీవీపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని పోలీసులు వేడుకున్నారు.