15-08-2025 12:49:27 AM
పీఏసీఎస్, సహకార బ్యాంకు పాలకవర్గ పదవీ కాలం పొడిగిస్తూ జీవో.836 జారీ
కరీంనగర్, ఆగస్టు 14 (విజయక్రాంతి) : ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పొడగించిన పదవీకాలం గురువారంతో ముగిసింది. ప్రభుత్వం మరోమారు ఆరు నెలలపాటు పొడగిస్తూ జీవో ఎంఎస్ నెం. 836ను జారీ చేసింది. కరీంనగర్ సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల్లోని 131 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పదవీకాలం మరో ఆరు నెలలు కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 131 పీఏసీఎస్లకు 2020 ఫిబ్రవరి 12న ఎన్నికలు జరిగాయి.
ఆ తర్వాత సహకార సొసైటీల పాలకవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. వీటి ఐదేళ్ల గడువు ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న ముగియగా, ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా ఆరు నెలల పదవీకాలం పొడగించింది. ఈ ఆరు నెలల పదవీకాలం గురువారం ముగియగా మరోమారు పొడగించడంతో సహకార సంఘాల ఎన్నికలను ప్రభుత్వం ఇప్పట్లో నిర్వహించే ఆలోచనలో లేనట్లు స్పష్టమయింది. కరీంనగర్ జిల్లాలో 30, జగిత్యాల జిల్లాలో 51, రాజన్న సిరిసిల్లలో 22, పెద్దపల్లి జిల్లాలో 28 పిఎసిఎస్ లు ఉన్నాయి.
జిల్లాల పునర్విభజన అనంతరం కూడా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉమ్మడి జిల్లా పరిధిలో కొనసాగుతుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ల విభజన జరిగింది కానీ, అప్పటి ప్రభుత్వం ఆర్బీఐ నుండి ప్రత్యేక చట్టం తీసుకురాకపోవడంతో ఉమ్మడి జిల్లా పరిధిలోనే నేటికి కొనసాగుతూ వస్తుంది. అయితే సొసైటీల బలోపేతం, సహకార సంఘాల వ్యవస్థ పటిష్టతకు రాష్ర్ట ప్రభుత్వం దృష్టిసారించిన నేపథ్యంలో ఎన్నికలు ఇప్పుడే నిర్వహించే ఆలోచన చేయకుండా పదవీకాలం పొడగించింది. ఈ పదవీకాలం పొడగింపు ద్వారా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎక్కువ మంది పీఏసీఎస్ చైర్మన్లు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ల పదవులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారే కొనసాగనున్నారు.
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షునిగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ కొండూరి రవీందర్ రావు కొనసాగుతున్నారు. ఆయన బీఆర్‌ఎస్ హయాంలో టెస్కాబ్ తెలంగాణ సహకార సంఘం అధ్యక్షనిగా కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులు కొనసాగిన అనంతరం ఆయనపై అవిశ్వాసానికి టెస్కాబ్ డైరెక్టర్లు సిద్ధం కావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షునిగా సేవలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పటికి ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఆయనకు మరో ఆరు నెలలు చైర్మన్ గా పనిచేసే అవకాశం దక్కింది.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే సహకారంపై దృష్టి..
ప్రస్తుతం 42 శాతం బీసీ రిజర్వేషన్ల వ్యవహారం నడుస్తుండడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలుచేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చూస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలుత సర్పం, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి తదనంతరం సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకే పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడగించింది.