calender_icon.png 15 August, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రాఫ్టింగ్ నడుస్తోంది..

15-08-2025 01:14:40 AM

  1. పరువు నష్టం నోటీసులకు సమాధానం రాలేదు

భట్టిపై కోర్టుకు వెళ్లే యోచనలో టీబీజేపీ చీఫ్

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): హెచ్‌సీయూ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన ఎన్.రాంచందర్ రావును టీ బీజేపీ చీఫ్‌గా ఎలా నియమిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఇచ్చిన నోటీసులకు ఇంకా సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై కోర్టుకు వెళ్లి తేల్చుకునేందుకు రాంచందర్ రావు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గత నెల 11న ఢిల్లీలో మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ... రోహిత్ వేముల ఆత్మహత్యకు రాంచందర్ రావే కారణమంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీ బీజేపీ చీఫ్ గత 15న ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు. భట్టి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు. నోటీసులు అందిన తర్వాత 3 రోజుల్లోగా తనకు క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు.

లేదంటే తన పరువుకు భంగం కలిగించినందుకు రూ. 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని, క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోక తప్పదని నోటీసుల్లో పేర్కొన్నారు. గత నెల 15న లీగల్ నోటీసులు ఇస్తే పోస్టల్ చట్టాల మేరకు 7 రోజుల్లోగా రిజిస్టర్డ్ పోస్ట్ బడ్వాడా అవుతుంది. పోస్టల్ రూల్స్ ప్రకారం చివరి రోజు నోటీసులు అందుకున్నా గత 22వ తేదీ వరకు నోటీసులు అందుకునేందుకు అవకాశం ఉంటుంది.

నోటీసులు అందుకున్న తర్వాత 3 రోజుల్లోగా అని చెప్పిన ప్రకారం చూసుకున్నా గత నెల 25వ తేదీ వరకు అవకాశం ఉంది. అంటే టీ బీజేపీ చీఫ్ చెప్పిన గడువు గత నెల 25నే ముగిసింది. ఇక బంతి ఇప్పుడు ఆయన కోర్టులోనే ఉంది. భట్టిపై ఇక కోర్టులో న్యాయపరంగా తేల్చుకుంటానని గత నెల 23న రాంచందర్ రావు విజయక్రాంతికి తెలిపారు. 

సర్ చాలా బిజీగా ఉన్నారు

భట్టికి లీగల్ నోటీసులు ఆ తర్వాత పరిణామాలపై బీజేపీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత రాంచందర్ రావు నిత్యం వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

దాంతో ఆయన భట్టి కేసుకు సంబంధించిన వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించలేకపోయారని తెలుస్తోంది. అయితే కోర్టులో కేసు వేసే అంశానికి సంబంధించి డ్రాఫ్టింగ్ నడుస్తోందని సమాచారం. పక్కాగా అన్ని ఆధారాలతో ఈ కేసులో భట్టిపై అభియోగాలు మోపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.