calender_icon.png 24 December, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాఖల సమన్వయమే కీలకం

24-12-2025 01:33:59 AM

  1. అధికారులు జవాబుదారీ తనంతో పని చేయాలి  
  2. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం ముందుకు..
  3. కార్యదర్శుల పనితీరుపై మూడు నెలలకోసారి నేనే సమీక్షిస్తా 
  4. వివిధ శాఖల సెక్రటరీలతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష  

హైదరాబాద్, డిసెంబర్  23 (విజయక్రాంతి) :  ‘ప్రభుత్వం ఎంత గొప్ప కార్య క్రమం తీసుకున్నా అధికారుల సహకారం ఉండాలి. అభివృద్ధి విషయంలో ఆయా శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకం.. అధికారులు కూడా జవాబుదారీతనంతో పనిచేయాలి.. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.  అధికారులు ఇప్పటికంటే పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలన్నారు.  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గరం..నరం.. బేషరమ్‌గా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

ప్రతి నెలా కార్యదర్శలు పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తారని.. ప్రతి మూడు నెలలకోసారి మీ పనితీరుపైన నేనే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్ని విభాగాల సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందని పేర్కొన్నారు.

ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించామని, కొన్ని ప్రణాళికలు రూపొందించుకు న్నామని తెలిపారు. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ వంటి వివిధ శాఖలకు ఒక పాలసీ అంటూ లేకపోవడంతోనే కొన్ని సమస్యలు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.  రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశామని సీఎం వివరించారు.  రాష్ట్రాన్ని క్యూర్ , ప్యూర్, రేర్‌గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని తెలిపారు.

రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ప్రణాళిక, కార్యాచరణ దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధికి అన్ని విభాగాలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.  రైజింగ్ విజన్ అమలుకు అన్ని విభాగాలు నిర్దిష్టమైన  కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని  దిశా నిర్దేశం చేశారు.   కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు.

కార్పొరేట్ తరహాలో సర్కారు స్కూళ్లలో నమోదు శాతం పెంచేందుకు రవాణా సదుపాయం, బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు దిశగా ప్రణాళికలుండాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటా టీచింగ్ హాస్పిటల్స్ను అద్భుతమైన వైద్యసేవలందించేలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. నిమ్స్ తరహాలో సనత్నగర్, కొత్తపేట, అల్వాల్ టిమ్స్, వరంగల్ హాస్పిటళ్లు, ఉస్మానియా కొత్త ఆసుపత్తి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా తీర్చిదిద్దాలని సీఎం చెప్పారు. 

ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు వివరాలు ఇవ్వాలి 

ప్రభుత్వ శాఖల్లోని రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతి సెక్రటరీ  జనవరి 26లోగా సీఎస్‌కు అందించా లని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రభు త్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకన్నదని సీఎం తెలిపారు. జనవరి 26లోపు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశించారు.