08-11-2025 12:00:00 AM
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విమర్శ
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు చేయకుండా తప్పించుకునేందుకు ఒక సీక్రెట్ ఎజెండాతో వ్యవహరి స్తోందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులు గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ఆముదం పంటకు ప్రత్యామ్నాయంగా పత్తి సాగుచేస్తున్నారని, ఈ పంటను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వున్న సీసీఐ కొనుగోలు చేయాల్సి ఉంటుందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పత్తి పట్టకు కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధర నిర్వహిస్తుందన్నారు. పత్తి పంటను అమ్ముకోవడానికి ముందుగానే యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన, ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని పరిమితి విధించడం చూస్తుంటే పత్తి కొనుగోలు నుంచి తప్పించుకోవాలని కేంద్రం చూస్తోందని ఆయన విమర్శిం చారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచి రైతు వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటోందని, కరోనా సమయంలో చల్లటి చలిలో వేలమంది రైతులు ఉద్యమం చేసిన రైతుల విన్నపాన్ని మన్నించలేదన్నారు. పత్తికి కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని నాలుగేళ్లుగా రైతులు కోరుతున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.