08-11-2025 12:00:00 AM
కరీంనగర్, నవంబర్ 7 (విజయక్రాంతి): నిరంతర అభ్యాసంతోనే విజయం సాధ్యమవుతుందని, శ్రద్ధ, క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విద్యార్థులకు సూచించారు. శాతవాహన వర్సిటీ రెండో స్నాతకోత్సవానికి శుక్రవారం గవర్నర్ హాజరయ్యారు. 25 మందికి పీహెచ్‌డీ పట్టాలతోపాటు 2018 నుంచి 2023 వరకు ప్రతిభ కనబరిచిన 161 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం విద్యార్థులను విజయం దిశగా తీసుకెళుతుందన్నారు. విద్యార్థుల మేధాశక్తియే వారి ప్రయోగశాలగా అభివర్ణించారు. విద్యార్థుల ఆలోచనలు, శ్రమ, సృజనాత్మకత వారిని సమాజంలో ముందుకు తీసుకె ళ్తాయని తెలిపారు. అవకాశం, సమానత్వం, సృజనాత్మకతతో ఎదగాలని ఆకాంక్షించారు. శాతవాహన విశ్వవిద్యాలయానికి న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ దిశగా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి సూచించారు. విద్యారంగం బోర్డు, చాక్ పీస్‌లకే పరిమితం కావద్దు అని పేర్కొన్నారు.
ప్రస్తుతం విద్యారంగం సాంకేతికతతో ముందుకు సాగుతోం దని, డిజిటల్ లెర్నింగ్ భౌగోళిక అవరోధాలను, అవకాశాల మధ్య వ్యత్యాసాలను చెరి పివేసిందని వివరించారు. ప్రపంచ విజ్ఞానాన్ని ఆహ్వానించాలని, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిపుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ మట్టి పరి మళాన్ని మరువవద్దని తెలిపారు.
అందరూ సమానంగా జీవించే సమాజమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. శ్రద్ధ, క్రమశిక్షణతో భయాన్ని, అలసటను అధికమించి ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ జేబీ రావు, శాతవాహన వర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్, కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.