calender_icon.png 8 November, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి రాజకీయాలు

08-11-2025 06:39:34 PM

హైదరాబాద్: 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన చూసి ఓటేయమని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అన్ని తప్పని క్షమాపణ చెప్పి ఓటేయ్యాలని అడగాలన్నారు. కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయంలో కూర్చునేది నువ్వే, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ ద్వారా మూసీకి తెస్తానని చెప్పింది నువ్వే కదా రేవంత్ అని ఆయన ప్రశ్నించారు. అప్పులపై పూటకో మాట, చిల్లర మాటలు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన తండ్రి చనిపోతే, దహన సంస్కారాల తర్వాత బావి దగ్గర స్నానం చేద్దామంటే కరెంట్ లేకుండే అని అసెంబ్లీలో చెప్పిండని, ఇవాళ ఆ ఊర్లలో 24 గంటలు కరెంట్ ఉందంటే దానికి కేసీఆర్ కారణమని హరీశ్ రావు గుర్తు చేశారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలోని భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగితే, ఆ వార్త బైటికి రాకుండా ఎందుకు తొక్కి పెట్టారు?, గుర్గావ్ లోని భట్టి విక్రమార్క అత్త గారి ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగి, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు తీసుకెళ్తే ఎక్కడా ఒక్క వార్త కూడా లేదు ఎందుకు?, పొంగులేటి గారి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగితే, ఎందుకు చెప్పలేదు? ఈడీ ఎందుకు ప్రెస్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు? అని అడిగారు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీతో చీకటి ఒప్పందం ఉందని అర్థం చేసుకోవాలని మాజీ మంత్రి తెలిపారు. 

2014-15లో తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ రూ.62 వేల కోట్లు. కానీ, 2023లో రూ.2.30 లక్షల కోట్లు ఉందన్నారు. బీఆర్ఎస్ హయంలో తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూను 4 రెట్లు పెంచామని, ఆ 10 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా మహమ్మారి వచ్చిందని వివరించారు. తాము 10 ఏళ్లలో 4 రేట్లు పెంచితే, రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో దాని మైనస్ చేశాడని హరీష్ రావు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ బకాయిలపై రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం రెండేళ్ల నుండి రూ.8 వేల కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్స్ కాలేజీలకు పెండింగ్ పెడితే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం బ్రతిమలాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

చివరికి సమ్మె చేస్తామని అంటే వాళ్ల మీద రేవంత్ రెడ్డి గుండాగిరికి దిగాడని, బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా వచ్చినా కష్టమొచ్చినా రూ.20508 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్స్ చెల్లించిందని ఈ సందర్భంగా హరీష్ రావు వెల్లడించారు. టీఎస్ఐపీఎఎస్ఎస్(TSIPASS) అధికారిక వెబ్ సైట్లో కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రూ.20,192 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానని అబద్ధాలు చెప్తున్నాడని ఆయన విరుచుకుపడ్డారు. ఆనాడు కేసీఆర్ పాలనలో కేటీఆర్ కృషితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడితే.. ఈనాడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు.