08-11-2025 07:00:32 PM
పటాన్చెరు: పటాన్చెరు నుంచి ఇంద్రేశం మీదుగా దౌల్తాబాద్ వెళ్లే ప్రధాన రహదారి అత్యంత దయనీయ స్థితికి మారింది. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్డంతా గుంతలతో నిండిపోయి, ప్రజలు ప్రమాదాలతో ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. రోడ్డు బాగు చేయాలని ఎన్నిమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోక పోవడంతో సమస్య మరింత జటిలమైందని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం దీక్ష నిర్వహించారు.
ఇంద్రేశంలో వేలాది కుటుంబాలు నివసిస్తున్నాయని, ఉద్యోగాలకు, పాఠశాలలకు వెళ్లే పిల్లలకు, అవసరాల కోసం బయటకు వెళ్లే ప్రజలకు అధ్వాన్నంగా మారిన రోడ్డు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. వెంటనే రోడ్లను మరమ్మత్తు చేయడంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.