calender_icon.png 24 October, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతులకు కూలీల కొరత

24-10-2025 12:52:34 AM

-పత్తి ఏరేందుకు అవస్థలు

-కిలోకు రూ.10 చొప్పున చెల్లించడంతో ఆర్థిక భారం

-వ్యవసాయ పనులకు దూరమైన కూలీలు 

-మహారాష్ట్ర నుంచి కూలీల రాక

ఆదిలాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): పత్తిని ఏరేందుకు కూలీలు దొరక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. అనేక మంది కూలీలు వ్యవసాయ పనులకు దూ రం కావడం... ఇతర పనుల్లో నిమగ్నం కావ డం వంటి సమస్య రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. చాలామంది ఎవరి పొలంలో వారే పనులు చేసుకోవడంతో పత్తి తీసేందుకు పల్లెల్లో కూలీలు దొరకని పరిస్థితి కని పిస్తోంది. ఫలితంగా కూలీల కోసం ఆదిలాబాద్ జిల్లా రైతులు పొరుగున ఉన్న మహా రాష్ట్రకు పరుగులు పెడుతున్నారు. అక్కడి కూలీ ధర కంటే అధికంగా చెల్లిస్తామని చెపు తూ ఇక్కడకు తీసుకొస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో రవాణా చార్జీలు సైతం రైతు లే భరిస్తున్నారు.

మహారాష్ట్ర నుంచి రాక

ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10.66 లక్షల ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారు. తాజాగా పత్తి పగిలి ఏరేందుకు సిద్ధంగా ఉండటం.. స్థానికంగా కూలీలు దొరక్కపోవడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన అనేక మంది రైతులు పొరుగు రాష్ట్రానికి పరుగులు తీస్తున్నారు. సరిహద్దు గ్రామాలతో పాటు కొంత కిన్వాట్, బొందిడి, మాం డ్వి, బోరి ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. కిలో పత్తి తీసేందుకు రూ.10 చెల్లించడంతో పాటు వారు స్థానికంగా కొన్ని రోజుల పాటు నివసించేందుకు నివాసాలు ఏర్పాటు చేయడం.. రేషన్ బియ్యం సైతం సమకూర్చడం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరికొన్ని పల్లెలకు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి రోజువారీగా ఆటో చార్జీలు చెల్లిస్తూ కూలీలను తీసుకొస్తున్నారు. వీరితో పాటు ఆదిలాబాద్ వంటి పట్టణాల నుంచి సైతం వందల సం ఖ్యలో పత్తి తీసేందుకు పల్లెలకు వెళ్తున్నారు.

అన్నదాతలపై ఆర్థిక భారం

ఏటా ఎదురవుతున్న కూలీల కొరత రైతులకు ఆర్థిక భారాన్ని తెచ్చి పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి మద్దతు ధర రూ.8,110 చెల్లించడం, తేమ శాతం కారణంగా మార్కెట్‌లో ధరలో భారీగా కోత పడుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నా రు. మరోపక్క ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో పాటు పంట పెట్టుబడి భారీగా పెరిగిపోవడం, వర్షాలతో దిగుబడి లేక మార్కెట్లో సరైన ధర రాక పోవ డంతో తీవ్ర ఆర్థిక భారం మోస్తున్నారు. పత్తి తీయడంతో పాటు కలుపు తీయడం, రసాయన ఎరువులు పిచికారి చేయడం తదితర పనులు చేయించేందుకు సైతం కూలీలకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇటీవల కలెక్టరేట్‌లో నిర్వహించిన అఖిల పక్ష సమావేశం లో రైతులు పత్తి సాగులో ఎదుర వుతున్న కష్టాలను అధికారుల ఎదుట ఏకరువు పెట్టారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లా లో అధికమంది రైతులు పత్తి పంటను నమ్ముకొని నష్టాలను భరిస్తున్నారు.

కూలీల కొరత తీవ్రంగా ఉంది కాంతరెడ్డి, రైతు

నేను పది ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నాను. కానీ అధిక వర్షాల కారణంగా పూత రాలిపోవడంతో పాటు పత్తి కాయలు మురిగిపోయి నష్టం జరిగింది. మిగిలిన పత్తి కాయలు పగిలి పంట చేతికి వస్తున్న సమయంలో పత్తి ఏరడానికి కూలీల కొరత అధికంగా ఉంది. కిలో పది రూపాయల చొప్పున ఏరిపిద్దామన్న స్థానికంగా కూలీలు దొరకడం లేదు. గత్యంతరం లేని పరిస్థితి లో పొరుగు రాష్ట్రం నుంచి కూలీలను తీసుకురావాల్సి వస్తోంది.