calender_icon.png 19 November, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షరతులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి

19-11-2025 12:00:00 AM

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

కల్వకుర్తి, నవంబర్ 18 : రైతులు పండించిన పంటను అమ్ముకునే సమయంలో ప్రభుత్వం అనవసరమైన షరతులు విధించడం వల్ల వారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్  అన్నారు. మంగళవారం కల్వకుర్తి మండలంలోని స్థానిక జిన్నింగ్ మిల్లులో మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్తో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎంతో శ్రమించి పండించిన పత్తిని కొనుగోలు కేంద్రాల్లో తీసుకోవడంలో ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు ఎంతో బాధాకరమని చెప్పారు.

కిసాన్ యాప్ సమస్యలు, క్యూ లైన్లో వేచిచూడాల్సిన పరిస్థితులు  రైతులను మరింత కుంగదీస్తున్నాయని ఆయన విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలు పక్కనబెట్టి, ప్రస్తుత సీజన్లో పత్తి రైతులను రక్షించే దిశగా ప్రభుత్వం తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని, ఎలాంటి షరతులు లేకుండా పత్తిని పూర్తిగా సేకరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాడు. పంటల సేకరణలో ఇబ్బందులు కొనసాగితే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. 

మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ మాట్లాడుతూ, రైతుల సమస్యలను ప్రభుత్వం లైట్గా తీసుకుంటోందని, సమస్యలు పరిష్కారానికి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.  కల్వకుర్తి పురపాలక సంఘం మాజీ అధ్యక్షుడు సత్యం, కార్మిక సంఘం నాయకుడు సూర్య ప్రకాష్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు విజయ్ గౌడ్,  గోవర్ధన్ గుప్తా , సురేష్ గౌడ్ జంగయ్య , రైతులు  పాల్గొన్నారు.