18-11-2025 11:26:07 PM
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
పునరావాసానికి ప్రత్యేక డీ-అడిక్షన్ కేంద్రాలు, చికిత్సా సేవలు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి) డ్రగ్స్ అనే మహమ్మారికి దూరంగా ఉండి, మీ జీవిత లక్ష్యాలకు దగ్గరవ్వండి.. మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి అని రాష్ర్ట దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వైద్య విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణను మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆయన అన్నారు. మంగళవారం గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో, ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మత్తు పదార్థాల దుష్ర్పభావాల నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందన్నారు. డ్రగ్ సరఫరా మార్గాలను నిర్మూలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈగిల్ స్పెషల్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేసి, 15,891 విద్యాసంస్థల్లో 7,018 కార్యక్రమాల ద్వారా 1.45 కోట్ల మందికి అవగాహన కల్పించాం. ఇది దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ అవగాహన కార్యక్రమం,అని మంత్రి స్పష్టం చేశారు. యువత పునరావాసం కోసం సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్‌లో డీ-అడిక్షన్ సెంటర్, పలు జైళ్లలో ప్రత్యేక చికిత్సా సేవలు ప్రారంభించామని, త్వరలో 12 జిల్లా ఆస్పత్రుల్లో కొత్త కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వైద్య విద్యార్థులందరిచేత మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. కళాకారులు ప్రదర్శించిన నాటకాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మాదకద్రవ్యాల నిర్మూలనలో సేవలందిస్తున్న వాలంటీర్లను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో ఉమెన్, చైల్డ్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి అనితా రామచంద్రన్, టీజీ ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఇతర ఉన్నతాధికారులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.