11-09-2025 11:11:43 PM
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బన్నీవాస్, వంశీ నందిపాటి బీవీ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై థియేటర్ల ద్వారా విడుదల చేశారు. ఈ సినిమా థ్యాంక్స్ మీట్‌ను గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ.. “ఒక్క వారం కాదు ఈ వారం, వచ్చే వారం.. అలా మా మూవీ ప్రదర్శితమవుతూనే ఉంటుంది. నేను ప్రస్తుతం గాల్లో ఉన్నా.. అంత సంతోషంగా ఉంది. ఇకపైనా ప్రేక్షకులకు నచ్చే చిత్రాలే చేస్తా. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చే కంటెంట్‌తోనే వస్తా” అని చెప్పారు.
డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. “లిటిల్ హార్ట్స్’ను నేను వెబ్‌సిరీస్‌లా చేయాలనుకున్నా. ఆ తర్వాత ఈటీవీ విన్ సాయికృష్ణ, నితిన్, ఆదిత్యహాసన్ సపోర్ట్‌గా నిలబడ్డారు” అని తెలిపారు. బన్నీవాస్ మాట్లాడుతూ.. ‘కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మే వాళ్లం మేమంతా. మా అంచనా నిజమైంది. ఈ సినిమాతో వచ్చే ప్రతి రూపాయీ నాకు కోటితో సమానం. ఎందుకంటే నా బీవీ వర్క్స్ బ్యానర్‌పై రిలీజ్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమా నాకు ఇచ్చిన కాన్ఫిడెంట్‌తో మరిన్ని చిత్రాలు చేస్తాను” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించిన మరో నిర్మాత వంశీ నందిపాటితోపాటు నటీనటులు నిఖిల్, జయకృష్ణ, హరి, పద్మిని, ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ, కంటెంట్ హెడ్ నితిన్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.
నాలుక కరుచుకున్న హీరోయిన్..
‘లిటిల్‌హార్ట్స్’ థాంక్స్‌మీట్‌లో ఈ సినిమా హీరోయిన్ శివానీ నాగరం నాలుక కరుచుకుంది. ఇది చెప్పొచ్చో లేదో.. అంటూనే ‘బెంగళూరులో అనుమతి లేకుండా ఓ గొరిల్లా షూట్ చేశామ’ని తెలిపింది. ఇంకా వివరంగా చెప్పబోతుంటే, అక్కడే వేదికపై ఉన్న బన్నీ వాసు చెప్పొద్దంటూ వారించటంతో శివాని ఆ విషయాన్ని అక్కడితో ఆపేసి, ప్రసంగాన్ని కొనసాగించింది. శివాని ఇంకా మాట్లాడుతూ.. “లిటిల్ హార్ట్స్’ సినిమాను మిగతా మీడియాతోపాటు మీమర్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాను 35 రోజుల్లోనే షూట్ చేశాం” అన్నారు.