24-07-2025 12:27:34 AM
లారీ డ్రైవర్ పరార్
నార్సింగి(చేగుంట), జులై 23 : అతివేగంగా లారీని నడుపుతూ కారును వెనుక నుంచి ఢీ కొట్టినందుకు వెంబడించి ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తిని లారీ డ్రైవర్ ఉద్దేశ పూర్వకంగా ఢీ కొట్టగా ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నార్సింగి మండల పరిధి లోని జాతీయ రహదారి 44 వల్లూరు శివారులో జరిగింది.
స్థానిక ఎస్‌ఐ బీమరి సృజన తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా రాయపోల్ కు చెందిన సత్తిరెడ్డి (45) తన బంధువుల అంత్యక్రియలలో పాల్గొనడానికి వెళ్ళి తిరిగి తన గ్రామానికి వస్తుండగా వల్లూరు మార్గమధ్యంలో హెచ్పీ పెట్రోల్ పంపు వద్దకు రాగానే రామాయంపేట నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న హర్యానా రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా కారును వెనుకనుంచి ఢీ కొట్టి లారీని ఆపకుండా పారిపోయాడు.
దీంతో లారీని సత్తిరెడ్డి వెంబడించి వల్లూరు బస్టాప్ వద్ద ఆపే క్రమంలో లారీ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా,సత్తిరెడ్డిని ఢీ కొట్టి పారిపోయాడు. ఈ క్రమంలో లారీ చక్రాలు, సత్తిరెడ్డి తలపై నుంచి వెళ్లగా అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదాన్ని చూసిన ప్రయాణికులు కొందరు లారీని వెంబడించి తూప్రాన్ లో లారీని పట్టుకోగా లారీ డ్రైవర్ పారిపోయాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్‌ఐ సృజన మృతదేహాన్ని రామాయంపేట కమ్యూనిటీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి సోదరుడు వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సృజన తెలిపారు