calender_icon.png 26 September, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ నేత మోసం.. ఆగిన రైతు గుండె

26-09-2025 12:12:56 AM

  1. రూ.90 వేలు అప్పు ఇచ్చి ఎకరం భూమి రిజిస్ట్రేషన్

వడ్డీతో సహా చెల్లించినపుడు తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ

అప్పు కడుతాను.. భూమి తన పేరున చేయాలని రైతు విన్నపం

మొత్తం 8 లక్షలు అయ్యింది.. భూమి ఇవ్వనని సీపీఐ నేత బెదిరింపులు

రైతు మనస్థాపం.. గుండెపోటుతో మృతి

సీపీఐ నేత ఇంటి ఎదుట మృతదేహంతో బంధువుల ఆందోళన

సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపల్లిలో ఘటన

చేర్యాల, సెప్టెంబర్ 25: రైతుల పక్షాన పోరాటం చేయాల్సిన సీపీఐ నాయకుడు రైతుకు రూ.90 వేల అప్పు ఇచ్చి ఎకరం భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. వడ్డీతో సహా చెల్లించినపుడు భూమి ని తిరిగి రైతు పేరున రిజిస్ట్రేషన్ చేస్తానని ఒప్పంద పత్రాలు రాసుకున్నాడు. అప్పు మొత్త చెల్లిస్తాను, భూమి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలంటూ అడిగిన రైతును.. మొ త్తం అప్పు రూ.8 లక్షలు అయ్యింది..

రిజిస్ట్రేషన్ చేయను, అసలు ఆ భూమిలోకి కూడా రావొద్దంటూ బెదిరించడంతో మనస్థాపానికి గురైన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలో జరిగింది. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కత్తుల భాస్కర్‌రెడ్డి సీపీఐ మండల సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అతడి వద్ద అదే గ్రామానికి చెందిన రైతు పాలోజు చంద్రం (45) 2018లో రూ.90 వేలు అప్పుగా తీసుకున్నాడు.

అప్పుకు గ్యారంటీగా ఎకరం భూమి ని భాస్కర్‌రెడ్డి తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. వడ్డీతో సహా డబ్బులు చెల్లించి నప్పుడు తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలంటూ భాస్కర్‌రెడ్డితో చంద్రం ఒప్పందం కుదుర్చుకుని, ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. అయితే అప్పు తీసుకున్న సమయంలో బాం డ్ పేపర్‌పై భాస్కర్‌రెడ్డి.. చంద్రంతో సంతకాలు తీసుకున్నాడు. అందులో రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు ఉన్నది.

దాన్ని చదవకుండానే చంద్రం సంతకాలు చేశాడు. అయితే కొన్ని రోజుల నుంచి అప్పు తిరిగి చెల్లిస్తాను తన భూమి తనకు రిజిస్ట్రేషన్ చేయాలంటూ భాస్కర్‌రెడ్డిని చంద్రం కోరుతూ వస్తున్నాడు. మొత్తం రూ.8 లక్షలు అప్పు పడ్డావని, నీకు ఇచ్చిన గడువు ముగిసింది. ఆ ఎకరం భూమి నీకు ఇచ్చేది లేదు, అందులో సాగుచేసిన వరి పంట సైతం తానే తీసుకుంటానంటూ చంద్రంను భూమి వైపు రావద్దంటూ భాస్కర్‌రెడ్డి బెదిరించాడు.

పెద్దమనుషుల మధ్య పలుమార్లు పంచాయతీలు నిర్వహించినా భాస్కర్‌రెడ్డి వినలేదు. రెండు రోజుల క్రితం వరి పంటకు యూరి యా చల్లుతున్న చంద్రం వద్దకు వెళ్లిన భాస్కర్‌రెడ్డి.. తన భూమిలో సాగుచేసిన పంటకు ఎరువులు వేయొద్దు, పంటను కోయొద్దు అంటూ అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. మనస్థాపానికి గురైన చంద్రం ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 

కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. చంద్రం మృతికి కత్తుల భాస్కర్‌రెడ్డి కారణమంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహాన్ని భాస్కర్‌రెడ్డి ఇంటి ముందు వేసి ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. చంద్రంకు న్యాయం జరిగేలా కొంత మంది బాధ్యత తీసుకోవడంతో ఆందోళన విరమించారు.