16-09-2025 10:18:01 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో నాలుగవ నంబర్ ప్లాట్ఫామ్ నిర్మించాలని, అదనంగా పట్టణ ప్రజలు రైల్వే ట్రాక్ దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, 2014లో మంజూరైన ఆర్ఓబి నిర్మాణం చేపట్టాలని, అండర్ బ్రిడ్జిలో ఇబ్బందులు కలగకుండా చూడాలని సీపీఐ ఆధ్వర్యంలో ప్రయాణికులు, ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా రైల్వే శాఖ అధికారులకు చూపేందుకు ఫోటోలతో ఫ్లెక్సీ ప్రింట్ చేయించి నిరసన తెలిపారు.
మహబూబాబాద్ నుంచి నెక్కొండ వరకు నూతనంగా నిర్మించిన మూడవ రైల్వే లైన్ పరిశీలన కోసం మంగళవారం దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం గోపాలకృష్ణ మహబూబాబాద్ కు రాగా సిపిఐ నేతలు వినూత్న నిరసనకు దిగారు. వీరి నిరసనకు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సంఘీభావం తెలిపి, అనంతరం వారంతా కలిసి డిఆర్ఎమ్ ను కలిసి ఫ్లెక్సీ ద్వారా సమస్యను వివరించి, వినతి పత్రం అందజేశారు.