16-09-2025 11:33:11 PM
చెరువులో తెగిపడ్డ విద్యుత్ తీగలను సరిచేసిన ఉద్యోగులు
ఇద్దరు ఉద్యోగుల కృషితో జెండా వెంకటాపూర్ కు విద్యుత్ పునరుద్ధరణ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): విధి నిర్వహణలో సాహసోపెతంగా వ్యవహరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు. భారీ వర్షాలకు నెన్నెల మండలం ఆవుడం విద్యుత్ సబ్ స్టేషన్ నుండి జెండ వెంకటాపూర్ గ్రామానికి వేసిన విద్యుత్తు లైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సోమవారం రాత్రి వర్ష బీభత్సానికి జెండ వెంకటాపూర్ చెరువులో విద్యుత్ వైర్లు నీళ్లలో తెగిపడ్డాయి. దీంతో సోమవారం రాత్రి నుండి జెండ వెంకటాపూర్ గ్రామానికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
గ్రామస్తుల ద్వారా సమాచారం తెలిసిన వెంటనే విద్యుత్ సబ్ స్టేషన్ లో లైన్మెన్ గా పనిచేస్తున్న మల్లేష్, అసిస్టెంట్ లైన్మెన్ రాజన్నలు మంగళవారం హుటాహుటిన జెండ వెంకటాపూర్ చెరువులో నీటి ప్రవాహాన్ని లెక్కచేయకుండా రబ్బర్ ట్యూబ్ ల సహాయంతో నీటిలోకి వెళ్లి తెగిన విద్యుత్ తీగలను సరి చేసి గ్రామానికి విద్యుత్ ను పునరుద్ధరించారు. సాహసోపేతంగా చెరువులు తెగిపడ్డ విద్యుత్ తీగలను సరిచేసి విద్యుత్ పునరుద్ధరించిన లైన్మెన్ మల్లేష్, అసిస్టెంట్ లైన్మెన్ రాజన్నలను గ్రామస్థులు అభినందించారు.