01-11-2025 12:00:00 AM
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, అక్టోబర్ 31 (విజయ క్రాంతి): పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం నెరవేస్తోందని ఆయన అన్నారు.
పేదల ఆత్మగౌరవ ప్రతీక అయిన సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం నెరవేస్తోందని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ప్రతి కుటుంబంలో సంతోషాలు నింపుతున్నాయని పేర్కొన్నారు. గృహప్రవేశం చేసుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇళ్లు లేని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే తమ లక్ష్యమని వివరించారు.
అనంతరం బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ఎల్లమ్మ కాలనీ డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీ కాలనీలో రూ.70 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
బాన్సువాడ, అక్టోబర్ 31 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు శుక్రవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం లోని పోతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ని మండలాలకు చెందిన 57 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల బిల్లులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
వర్ని మండలం పాత వర్ని, జలాల్ పూర్, జకోరా, SN పురం గ్రామాలకు చెందిన 24 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 82,41, 056/- ,పోతంగల్ సుంకిని గ్రామానికి చెందిన 20 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 56,44,800/- , కోటగిరి మండ లం ఎక్లాస్పూర్ క్యాంప్ గ్రామానికి చెందిన 05 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 16,12,800/- ,రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన 8 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 24,18,474/- , మొత్తం 57 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 1,79,17, 130/-పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.