02-05-2025 12:08:55 AM
మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, మే 1: అధికారంలోకి రావడం కొరకు అడ్డగోలుగా హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని అమలు చేయలేక బిఆర్‌ఎస్ పార్టీ పైన విమర్శలకు దిగుతుందని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్ని రోజులు పదవిలో ఉంటాడో గ్యారెంటీ లేదన్నారు. అధికారం కోసం దిగజారే నైజం రేవంత్ రెడ్డిదన్నారు. కేసీఆర్ పై చిల్లర మాటలు మాని హామీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తెలంగాణ ద్రోహులకు కొమ్ము కాసేటోళ్లకు మన అభివృద్ధి కొరకు పని చేస్తారనటం కూడా భ్రమేనన్నారు.
తెలంగాణలో పదవులను అనుభవిస్తూ ఆంధ్రాకు వత్తాసు పాలకడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ కన్నా సిఎం తన వ్యక్తిగత ప్రచారమే ఎక్కువ చేసుకుంటున్నాడన్నారు. వరంగల్ ఎల్కతుర్తి బిఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కెసిఆర్ మాటలను ప్రజలంతా స్వాగతించారని, ఆ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించలేదని అక్కసు వెళ్ళగక్కుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే సిఎం పేరు మరచిపోతున్నారని పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది ప్రేమతో కాదని భయంతోనని, ముమ్మాటికీ తెలంగాణా శత్రువు ఆ పార్టీనేనని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు.