23-09-2025 12:00:00 AM
-ప్రకృతి కన్నెరతో ఏటా పంట నష్టం
-ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో పరిహారం అందని పరిస్థితి
-భారీ వర్షాలతో ఈసారి తీవ్రంగా దెబ్బతిన్న పంటలు
-ప్రభుత్వ సాయంపైనే అన్నదాతల ఎదురు చూపులు
అదిలాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : ఎపుడైనా అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే ఆర్థిక అండ కోసం బీమా సౌకర్యం తప్పని సరిగా ఉండాలంటారు. అందుకే భీమా లేనిదే జీవితానికి ధీమా లేదు. అలాం టి ధీమా మనుషులకే కాదు.. పంటలకు అత్యవసరంగా మారింది. ప్రస్తుత కాలంలో ఎప్పుడు అతివృష్టి ఏర్పడుతుందో.. ఎన్న డూ అనావృష్టి కనిపిస్తుందో తెలియని పరిస్థితి. ఈ సమయంలో ఏదేని కారణంతో పం టలు నష్టపోతే భీమా సౌకర్యం ఉంటే ఆర్థిక సాయం అందుతుందనే ధీమా రైతుల్లో ఉం టుంది.
కానీ గత కొన్నేళ్ల నుంచి రైతులకు ఇలాంటి సౌకర్యం లేకపోవడంతో ఆర్ధిక సాయం రాక అన్నదాతలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఆపత్కాలంలో ప్రభుత్వాలు ఆడపదడపా సాయం అందిస్తున్నా.. జరిగిన నష్టం అధికంగా ఉండటం.. సర్కారు సాయం తక్కువ అందించడం వంటి పరిస్థితుల్లో అన్నదాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు తమ వాటా కింద డబ్బులు చెల్లించకపోవడంతో పంటలు నష్టపోయిన సందర్భంలో రైతులకు పరిహారం రాలేని పరిస్థితి కనిపిస్తోంది.
ఇదేళ్ల నుంచి ఆగిపోయింది..
రాష్ట్రంలో ఇది వరకు రైతులకు వాతవరణ ఆధారిత భీమా (ఫసల్ బీమా )అమలయ్యేది. 2016 ఏప్రిల్ లో ప్రారంభమైన ఈ పథకం మొదలైంది. రైతులు వేసే పంటలకు సంబంధించి వాతావరణం ఆధారిత భీమా కోసం బ్యాంకుల ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు చెల్లించేవారు. వీటికి తోడుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కూడా చెల్లించేవి. దీంతో అధిక వర్షాలు, లేదంటే వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా పంటల వారీగా సర్వే చేయించి పంట నష్టం వివరాలు పంపించేవారు. ఇన్సూరెన్స్ కంపెనీలు నష్ట పరిహారం అందించేవి.
కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతుబందు, రైతుభీమా వంటి పథకాలు అమలు చేస్తున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఫసల్ భీమా పథకం లో చేరలేదు. 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా చెల్లించడం నిలిపివేయడంతో ఈ ఫసల్ భీమా సౌకర్యం కూడా ఆగిపోయింది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏటా అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోతున్నా పరిహారం దక్కని పరిస్థితి తలెత్తుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది సుమారు 15 లక్షల ఎకరాల్లో పత్తి, సోయా, వరి, కందులు, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 18,600 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. కుము రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది.
ప్రభుత్వ హామీ ఏమైంది?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫసల్ భీమా సౌకర్యం అమలు చేస్తామని ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతుల వాటాను సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని భరోసా ఇచ్చారు. అధికారంలోకి రావ డంతో పాటు మంత్రులు సైతం ఇందుకు రూ. 1,500 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. కానీ అధికారం లోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటినా ఫసల్ భీమాపై నిర్ణయం తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకమైన పంటల భీమా పథకం తీసుకొస్తామని సైతం ప్రకటించింది. కానీ అమలు చేయడంలో మాత్రం జాప్యం జరగడంతో ప్రకృతి ప్రకోపాలకు బలవుతున్న అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంటలకు భీమా సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.