calender_icon.png 23 August, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి

23-08-2025 01:26:08 AM

విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఆర్.కృష్ణయ్య, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (విజయక్రాంతి) : రాష్ర్టవ్యాప్తంగా 16.75 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. బీసీ విద్యార్థి సంఘం రాష్ర్ట అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం వందలాది మంది విద్యార్థులు మసాబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ను ముట్టడించా రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేయడంతో ఆ ప్రాంగణాన్ని దద్దరిల్లిపోయింది. 

ఈ ఆందోళనతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.గత మూడేళ్లుగా సుమారు రూ.ఎనిమిది వేల కోట రూపాయల బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో లక్షలాది మంది పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు గాల్లో దీపంగా మారిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పది నెలలుగా విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభు త్వం స్పందించకపోవడం దారుణమని మం డిపడ్డారు.

విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడు తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నా ఆర్థిక శాఖ అధికారులు వాటిని పెడచెవిన పెడుతున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్ కంటే కాంట్రాక్టర్ల బిల్లులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ నిర్లక్ష్యం వల్ల కళాశాలల యాజ మాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.. దీంతో వారు మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కాంట్రాక్టర్లకు ఆగమేఘాల మీద బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం, విద్యార్థుల జీవితాలను నిలబెట్టే స్కాలర్‌షిప్‌లను ఎందుకు విస్మరిస్తోంది? ఆర్థిక శాఖకు విద్యార్థుల కష్టాలు కనిపించడం లేదా?” అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

ఆర్థిక శాఖ తన వైఖరిని మా ర్చుకోకపోతే రాష్ర్టవ్యాప్తంగా తీవ్ర తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలన్నీ విడుదల చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ర్టవ్యాప్తం గా ఆందోళనలకు దిగుతామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.  కార్యక్రమంలో విద్యార్థి నేతలు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేష్, నందగోపాల్, ప్రీతం, సుధాకర్, చంద్రశేఖర్, రాజేందర్, లింగయ్య, రాఘవేందర్, మణికంఠ, నరసింహ గౌడ్, ఉమేష్, రాకేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.