23-09-2025 12:15:04 AM
కూరగాయలకు వెళ్లాలంటే ప్రాణభయమే
నిత్యం వాహనాల గజిబిజీతో ప్రమాద ఘంటికలు
గోదావరిఖని, సెప్టెంబర్ 14, (విజయ క్రాంతి) ఇది గోదావరిఖని రాంమందిర్ ఏరియా నుంచి అవతల కూరగాయల మార్కెట్ కు వెళ్లే రహదారి. పైగా గోదావరిఖని పైయింక్లైయిన్ నుంచి చౌరస్తాకు వెళ్లే ప్రధాన రోడ్డు కూడా. ఇక్కడ వాహనాల రాకపోకల గందరగోళం చూస్తున్నారు కదా...! చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంటే..ఇక రోడ్డు దాటాలంటే ఏలా ఉంటుందో ఆలోచించండి.
అసలు విషయానికొస్తే... ఇక్కడ రోడ్డు దాటితే మీరు పునర్జన్మ ఎత్తినట్లే. ఔను.. ముమ్మాటికి ఇది వాస్తవం అంటున్నారు. స్థానికులు. రాంమందిర్ ఏరియా పరిధి సీతానగర్, మల్లికార్జున్ నగర్, అంబేడ్కర్ నగర్, రాంనగర్ తదితర ప్రాంతాల నుంచి అవతల వైపు గల కూరగాయల మార్కెట్ కు వెళ్లాలంటే ఇదే మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. ఇటు అటుగా ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి.
ఇటువైపు పాన్ టేలాల వద్దకు నిత్యం వినియోగదారులు వస్తుంటారు. అటువైపు పండ్ల దుకాణం, కూరగాయల మార్కెట్, మాంసం దుకాణాలకు తప్పనిసరిగా ఇదే రూటులో వెళ్లాలి. కానీ ఇక్కడ వాహనాల నియంత్రణ ఎవరికీ పట్టడం లేదు. దీనితో తరచుగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు అతివేగంగా వస్తుంటాయి. కాలి నడకన రోడ్డు దాటాలనుకునే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఒక్క పరుగున వెళ్లాల్సి వస్తుంది.
కాసేపు ఆలోచించి అడుగు తీసి అడుగు వేసేలోగా వాహనాలు వాయువేగంతో దూసుకొచ్చి ఢీకొడుతున్నాయి. ఇలా అనేక మంది ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఇక మహిళలు రోడ్డు దాటే పరిస్థితి అస్సలు ఉండదు. ఇక్కడ రోడ్డు దాటి కూరగాయల మార్కెట్ కు వెళ్లాలంటే మృత్యువుతో పోరాడాల్సి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గానీ, కార్పొరేషన్ అధికారులు గానీ స్పందించి గాంధీనగర్ వద్ద మాదిరిగా ఇక్కడ కూడా మార్గంను పూర్తిగా మూసివేసి వన్ వే చేయాలని స్థానికులుకోరుతున్నారు.