27-12-2025 02:00:45 AM
రైతు, విద్యార్థుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర మంత్రులకు మాజీ మంత్రి జోగు రామన్న వినతి
ఆదిలాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తుపై, రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తో పాటు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ను కలిసారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, తో పాటు అఖిల పక్ష రైతు సంఘం నేతలతో కలిసి మంత్రులకు పత్రాన్ని అందజేసి, పలు సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పలు సార్లు పర్యటిస్తున్నారే తప్ప అబివృద్ధి ఫలితం శూన్యం అన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు స్థానికంగా ఉన్నతమైన విద్యను అందించే దిశగా కృషి చేయడం జరిగిందన్నారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్, బిఎస్సి నర్సింగ్ కాలేజ్ పనులు ముందుకు సాగపోవడంలో నిర్లక్ష్యం తగదు అన్నారు.
స్థానిక ఎంపీ ఎమ్మెల్యే విద్యార్థుల సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంలో విఫలం అవుతున్నారన్నారు. ఇంద్రవెల్లి లో యూనివర్సిటీ ఏర్పాటుకు ఎలాంటి సర్వేలు గానీ, పనులు చేపట్టకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి, గోవర్ధన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.