27-05-2025 12:59:34 AM
ఘనంగా ముగిసిన సరస్వతీ పుష్కరాలు
- ఆఖరి రోజు ఘనంగా హోమాలు, పూర్ణాహుతి
- 12 రోజుల్లో 30 లక్షల మంది భక్తుల రాక
- మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
- చివరిరోజు లక్షమంది భక్తుల పుష్కర స్నానం
- సీఎస్ రామకృష్ణారావు పుణ్య స్నానం
కరీంనగర్/మంథని, మే 26 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 14న ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలు సోమవారంతో ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల సం పద, ఆరోగ్యం, వృద్ధి, పాడిపంటల శుభఫలితాల కోసం 12 రోజుల పాటు వైభ వంగా నిర్వహించిన హోమాలు సోమవారం పూర్ణాహుతితో ముగిశాయి.
ఈ వేడుకల్లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య ర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మదన్ మోహన్, మక్కన్ సింగ్, పద్మశ్రీ నాగఫణి శర్మ, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి వికాస్‌రాజ్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్‌రావు, ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు విజయవంతంగా నిర్వహించామని, ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు
తెలుపుతున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రోజుకు లక్ష మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేయగా రెట్టింపు సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుష్కరాలను ఘనంగా నిర్వహించేం దుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, మంథ ని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక శ్రద్ధ వహించి ఏర్పాట్లు చేశారు.
మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వరానికి మాత్రం ప్రత్యేకత ఉంది. 2023లో ఇదే ప్రాంతంలో ప్రాణహిత పుష్కరాలు జరుగగా, 2025 మే 14 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు జరిగాయి. తిరిగి 2027 జూలై 23న గోదావరి పుష్కరాలు ఇదే ప్రాంతంలో జరగను న్నాయి. ఐదు సంవత్సరాల్లో మూడు పుష్కరాలను ముద్దాడిన కాళేశ్వరం వద్ద ప్రవహించే గోదావరి, ప్రాణహిత, సరస్వతీ అంతర్వావాణి ప్రాంతానికి విశిష్ఠత ఉంది.
పుష్కరాలు విజయవంతం: మంత్రి శ్రీధర్‌బాబు
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు విజయవంతంగా నిర్వహించామని, ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఐటీ శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. 12 రోజుల నుంచి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాత్రదారులయ్యారని జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
ఎన్నికల నిబంధనల వల్ల పనులు చేపట్టేందుకు కొద్దిగా ఇబ్బంది కలిగినా జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం తక్కువ సమయంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు చేసిన పుష్కరాలు దిగ్విజయం అయ్యాయని తెలిపారు.
12 రోజుల్లో దాదాపు 30 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని చెప్పారు. గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా జరుపుతామని అన్నారు. పుష్కరాల నిర్వహణ కోసం కృషిచేసిన అధికారులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రమాదవశాత్తు బస్సు దగ్ధం
సోమవారం సిరిసిల్ల నుంచి కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వచ్చిన ప్రైవేట్ బస్సు లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు ను పక్కకు నిలిపివేసి భక్తులను దించాడు. ఆ తర్వాత బస్సుపూర్తిగా దగ్ధం అయింది.
ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: శైలజారామయ్యర్
సోమవారం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగిన ముగింపు వేడుకలకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు, ఈవో మహేష్ పాల్గొన్నారు. ఈ 12 హోమాలు ప్రజల ఆర్థిక, శారీరక శ్రేయస్సు మరియు వ్యవసాయోత్పత్తి అభివృద్ధికి శుభపరిణా మాలు కలగాలని ఆకాంక్షతో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు.
వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సందర్భంగా శాంతి, ఐశ్వర్యం, సమృద్ధిని కోరుతూ విశేష పూజలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చేశారు.