28-05-2025 01:58:17 AM
ప్రజల్లో ఎన్‌టీఆర్‌గా సు ప్రసిద్ధుడైన మహామహుడు నందమూరి తారక రామా రావు కృష్జా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించారు. ఆ యన ఎంత గొప్ప నటుడో అంత టి మహత్తర ప్రజా నాయకుడు కూడా. విలక్షణమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. మొత్తం 300కి పైగా చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ దేవుళ్ల పాత్రలలో ముఖ్యంగా శ్రీకృష్ణుని పాత్రలో చూపిన ప్రతిభ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’గా అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఆయన భారతీయ సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 1968లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. ఎన్‌టీఆర్ దర్శకుడిగా పనిచేసిన ‘వరకట్నం’ చిత్రానికి, నిర్మాతగా రూపొందించిన ‘తోడు దొంగలు’, ‘సీతారామ కల్యాణం’ చిత్రాలకు జాతీయ పురస్కారాలు లభించాయి.
‘బడి పంతులు’ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమనటుడి అవార్డు, ‘కోడలు దిద్దిన కాపురం’ చిత్రానికి నంది అవార్డు వారి కళా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా మారిన నాయకుడు కోట్లాది ప్రజల హృదయాలలో అన్నగానూ స్థిరపడ్డారు. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో విద్యను అభ్యసించారు. మంగళగిరిలో కొంతకాలం సబ్- రిజిస్ట్రార్‌గా పనిచేసి, 1949లో ‘మన దేశం’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి వాహకుడిగా నిలిచి 1983లో తొలిసారిగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఆరోగ్య కారణాల వల్ల 1984లో తాత్కాలికంగా పదవి కోల్పోయినా, తిరిగి గెలిచి రాజకీయంగా తన శక్తిని చాటారు. 1985 ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ పాలన సామాన్యుడికి చేరువైంది.
ఆయన మహిళలకు ఆస్తిహక్కులు కల్పించడంలో శాశ్వత ముద్ర వేశారు. రైతులకు గరిష్ఠ మద్దతు ధరలు, రేషన్ ద్వారా బియ్యం సరఫరా, పేదలకు వైద్యం వంటి సంక్షేమ పథకాలను ఆయన ప్రతిష్ఠాత్మకంగా అమలు చేశారు. ఆయన నేతృత్వంలో వచ్చిన రాజకీయ మార్పులు, కొత్త దారులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుత బలాన్నిచ్చాయి.
1985లో భార్య బసవ తారకం మరణం ఎన్‌టీఆర్‌ను తీవ్రంగా కలచివేసింది. 1993లో లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు. 1995లో చం ద్రబాబు నాయుడు పార్టీపై నియంత్రణ సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1996 జనవరి 18న హృదయఘాతంతో ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచి పోయినప్పటికీ ఆయన ఆశయాలు, ఆలోచనలు తెలుగు ప్రజల మనసుల్లో అజరామరంగా నిలిచాయి.
సినీ ప్రపంచంలో తాను సాధించిన ఘనత, ప్రజల కోసం రాజకీయంగా చేసిన పోరాటం ఆయనను అశేషజనావళి హృదయాలలో దైవ స్వరూపునిగా నిలిపాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర తరతరాలుగా ఆదర్శప్రాయం.
భౌతికంగా ఆయన మనలను వీడి మూడు దశాబ్దాలు (18 జనవరి 1996) కావస్తున్నా ప్రజల హృదయాల్లో ఒక శాశ్వత జ్వాలవలె చిరస్మరణీయంగా ప్రకాశిస్తూనే ఉన్నారు. ఆయన చూపిన మార్గం తెలుగువారి అభివృద్ధికి సోపానం అనడంలో సందేహం లేదు.
డాక్టర్ కృష్ణకుమార్ వేపకొమ్మ