calender_icon.png 29 May, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైర్ సెఫ్టీకి ప్రమాణాలు మార్చాలి

28-05-2025 12:37:15 AM

కోటికి పైగా జనాభాతో మెట్రో నగరాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది మన భాగ్యనగరం. రాజధానిగా తెలంగాణకు తలమానికంగా నిలుస్తూ అభివృద్ధి  పథంలో దూసుకుపోతోంది హైదరాబాద్.

అన్ని రంగాల్లో సమాన స్థాయి అభివృద్ధి, పురోగతి సాధిస్తున్నప్పటికీ ఫైర్ సేఫ్టీ విషయం లో మాత్రం నగరవాసులకు  కనీస అవగాహన లేకుండాపోతోంది. కోట్ల రూపాయలు పెట్టి ఇండ్లు కడుతున్నప్పటికీ 10వేలు ఖర్చుపెట్టి ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చుకునేందుకు జనం వెనుకాడుతు న్నారు.

ఇలాంటి పరికరాలు లేకపోవడం వల్లే తర చూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ వందల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లుతున్నది. తాజాగా హైదరాబాద్‌లోని గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఒకవేళ ప్రమాదస్థలిలో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉండుంటే నష్ట నివారణ కాస్తయినా తగ్గి ఉండేది.

తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నప్పటికీ.. గుల్జార్ హౌస్ ఘటన ద్వారా అగ్నిప్రమా దాలు ఎంత భయానకమనేది తెలిసొచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపై సీరియస్‌గా ఆలోచించా ల్సిన అవసరముంది. అగ్నిప్రమాదాలపై సామాన్యులకు అవగాహన కల్పిస్తూ  ప్రతీ ఇంట్లో ఫైర్ సేఫ్టీ పరికరం అమర్చుకొనేందుకు చర్యలు చేపట్టాలి. 

అగ్నిప్రమాదాలు జరగడానికి ముఖ్యకారణం సరైన అవగాహన లేకపోవడమే. ఉదాహరణకు ఒక ప్రాంతంలో 20 లేదా 30 అంతస్థుల భవనాన్ని నిర్మించడానికి కచ్చితమైన బిల్డింగ్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరి. కానీ ఇవేమీ పట్టించుకోకుండానే బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరముంది.

12 ఫోర్లు దాటి కట్టే మల్టీస్టోరీ బిల్డింగ్‌లకు అంతర్జాతీ య ప్రమాణాలతో కూడిన ఫైర్ సేఫ్టీ సహా అన్ని రకాల అనుమతులు తప్పనిసరి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే  ఫైర్ సర్వీస్ ట్యాక్స్ పేరిట ఎక్కువ జరిమానా వసూలు చేయడం, ఫైర్ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకొని భవంతుల నిర్మా ణాలకు అనుమతి రద్దు చేయడం లాంటివి చేయాలి. యేటా సంభవిస్తున్న అగ్ని ప్రమాదాల్లో 99 శాతం.. 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న నాన్ హైరైజ్ బిల్డింగ్స్‌లోనే జరుగుతున్నాయి. 

జనావాసాల మధ్య ఉన్న షాపింగ్ కాంప్లెక్సులు, కంపెనీల్లో ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవిస్తోంది. 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న నిర్మాణాలకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు వర్తించవు. ఇలాంటి బిల్డింగ్స్‌కు ప్రస్తుత చట్టం ప్రకారం అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదు.

దీంతో నాన్ హైరైజ్ బిల్డింగ్స్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని గుర్తించిన అగ్నిమాపక శాఖ ఇక నుంచి హైరైజ్ బిల్డింగ్స్‌తో పాటు నాన్ హైరైజ్ బిల్డింగ్‌లను కూడా చట్ట పరిధిలోకి తీసుకురానుంది. కమర్షియల్ కాంప్లెక్స్‌లు సహా ఇతర నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతం చదరపు గజానికి ఒక్క రూపాయి మాత్ర మే ఫైర్ సర్వీస్ ట్యాక్స్ అమల్లో ఉంది. ఫైర్ సేఫ్టీ అవసరాలకు అనుగుణంగా ట్యాక్స్‌ను పెంచే విధంగా ప్రభుత్వానికి అగ్నిమాపక సిబ్బంది ప్రతిపాదనలు పంపించింది.

ఇక అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్ హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోకి వస్తోంది. పాతబస్తీలో చాలా ఇండ్ల నిర్మాణం కనీస భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలు లేకుండానే జరిగింది. ఇరుకు సందుల్లో ఒక ఇంటికి, మరో ఇంటికి కనీస గ్యాప్ లేకుండా నిర్మాణాలు ఉండటంతో తరచూ అగ్నిప్రమాదాలకు కారణమవుతోంది.

అగ్నిప్రమాద సమాచారం అందినప్పటికీ ఇరుకు రోడ్లు, అస్తవ్యస్థ ఇండ్ల నిర్మాణం కారణంగా సిబ్బంది సకాలంలో ఘటనా స్థలికి చేరుకోలేకపోతున్నారు. దీనివల్ల ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా ఎక్కువగానే ఉంటోంది.

అగ్నిప్రమాదాలు అరికట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం బాంబే పునరావాస ప్రణాళిక చట్టం (బాంబే రీసెటిల్‌మెంట్ ప్లాన్) తరహాలో కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముంది. పాతబస్తీలో ఉపయోగంలో ఉన్న పాత భవనాలను గుర్తించి జోనల్, సబ్‌జోనల్ క్యాటగిరీలో విభజించి ప్రత్యేక సొసైటీలు ఏర్పాటు చేయాలి.

ప్రస్తుతమున్న భవనాలతో పోలిస్తే కొత్తగా నిర్మితమయ్యే భవనాలకు 100 శాతం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) ఇవ్వాల్సిన అవసరముంది. అగ్నిప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ మొదలైన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలి.

బిల్డింగ్ నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టే బిల్డర్లకు అదనపు ఎఫ్‌ఎస్‌ఐ కేటాయించడం వల్ల నిర్మాణాలకు ఎక్కువ మొత్తంలో నిధులు లభించే అవకాశముంటుంది. మొత్తంగా ప్రభుత్వం అనుకున్న ప్రణాళికను కచ్చితంగా అమలు చేస్తే రాబోయే కొన్నేళ్లలోనే అత్యాధునిక హంగులతో నిర్మించిన పాతబస్తీ సాక్షాత్కరించడం ఖాయం.

అగ్నిప్రమాదాలు అరికట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం బాంబే పునరావాస 

ప్రణాళిక చట్టం (బాంబే రీసెటిల్‌మెంట్ ప్లాన్) తరహాలో కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముంది. పాత భవనాలను గుర్తించి జోనల్, సబ్‌జోనల్ క్యాటగిరీలో విభజించి ప్రత్యేక సొసైటీలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతమున్న భవనాలతో పోలిస్తే కొత్తగా నిర్మితమయ్యే భవనాలకు 100 శాతం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) ఇవ్వాల్సిన అవసరముంది. అగ్నిప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ మొదలైన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలి.