calender_icon.png 29 May, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకంతో కూడిన విశ్వాసం!

28-05-2025 02:02:52 AM

ఉదాత్తమైన వ్యక్తులు తామిచ్చిన మాటను ప్రాణసమంగా భావిస్తారు. పరస్పర విశ్వాసం, ఒప్పందాలు భాగస్వామ్యంలో ఫల ప్రదమ వుతాయి. పరిస్థితుల ప్రాబల్యాన్ని అధిగమించిన స్వచ్ఛమైన స్నేహం పరిమళిస్తుంది. సంకల్పాలు స్వచ్ఛమైనప్పుడు భాగస్వామ్యం పరిఢవిల్లుతుంది. 

ఏవం షడ్భిర్గుణైరేతైః స్థితః 

ప్రకృతి మండలే

పర్యేషేత క్షయాత్ స్థానం 

స్థానాద్వృద్ధిం చ కర్మసు॥

కౌటిలీయం: (7.1) ప్రకృతి మండలంలో ఉన్న రాజు ఆరు గుణాలను అనుసరిస్తూ పతనావస్థ నుంచి ఉచ్చస్థితికి, ఉచ్చస్థితి నుంచి సమున్నత స్థితికి, అభ్యుదయాన్నీ సాధించడాని కి ప్రయత్నించాలి. ఆ గుణాలు: సంధి, విగ్రహం, ఆసనం, యానం, సంశ్రయం, ద్వైదీభావం. శత్రువుతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సంధి కాగా అపకారం చేయడం విగ్రహం.

ఉపేక్షించడం ఆసనం, దండెత్తడం యానం, లొంగిపోవడం సంశ్రయం. సంధి విగ్రహాలు రెండింటితో పని జరిపించడం ద్వైదీభావం. వృద్ధిని సాధించడానికి అప్పటికేది అవసరమో దానిని అనుసరించడం నాయకునికి విజయాన్నిస్తుంది.

ఈ ఆరు గుణాలను ఏ విధంగా ఉపయోగించాలనే విషయాన్ని కౌటిల్యుడు వివరించాడు. ఏ మార్గాన్ని ఆశ్రయించాలన్నా ఎవరిని నమ్మాలి, ఎంతవరకు నమ్మాలో తెలియాలి. నమ్మదగిన వారినికూడా అతిగా నమ్మడం ప్రమాద హేతువే. అలాగని నమ్మదగిన వారిని దూరం చేసుకోవద్దు. దీనికి సంబంధించిన ఒక కథ మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకు బోధిస్తాడు.

శత్రువులు ఎప్పుడు మిత్రులు కావాలి?

ఒకప్పుడు ఒక మఱ్ఱిచెట్టు పక్కన కలుగులో ఓ ఎలుక కాపురం ఉండేది. ఒకనాడు అది కలుగులోంచి బయటకు రాగా, వేటగాడొకడు పక్షులకై పన్నిన వలలో చిక్కుకున్న పిల్లి ఒకటి కనిపించింది. శత్రువైన పిల్లికి కలిగిన అపదను చూసిన ఎలుక సంతోషంతో నర్తించింది. అంతలోనే చెట్టుపైకి చూస్తే గుడ్లగూబ కనిపించింది.

కలుగులోకి వెళదామని చూస్తే అక్కడి నుంచి ఒక ముంగీస తనవైపే వస్తూ కనిపించింది. గుడ్లగూబ కాని ముంగీస గాని తనను తినేయడం ఖాయమని భయపడినా ఆలోచించింది. భయం ఒత్తిడిని పెంచుతుంది. సరైన ఆలోచన అవకాశాలను ఇస్తుంది. అలాగే ఓడిపోతామని ముందే ఓటమిని ఒప్పుకోవడం కన్నా పోరాడి ఓడడం శ్రేయస్కరం.

అందుకే ధైర్యంగా పిల్లి వద్దకు వెళ్ళి 

“మిత్రమా! నువు ఆపదలో ఉన్నావు. నేనూ ఆపదలో ఉన్నాను. మన మధ్య ఉండే ఈ సహజ శత్రుత్వాన్ని మరచి సహకరించుకుందాం. పరస్పర సహకారం వల్ల ఇరువురమూ రక్షింపబడతాం. నీ వల త్రాళ్ళను నేను కొరుకుతాను. ముంగీస, గుడ్లగూబల నుంచి నువు నన్ను రక్షించాలి” అని వేడుకుంది. 

స్నేహం, శత్రుత్వం, స్పర్ధలు, సహకారాలు, పోటీతత్త్వం, భాగస్వామ్యాలు.. ఇవన్నీ సమయ సందర్భాలు, పరిస్థితులను అనుసరించి ఉంటాయి. ఎలుక అవసరం, తన నిస్సహాయత పిల్లికి అర్థమైంది. రెండూ పరస్పరం విశ్వాసంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. నమ్మకమూ ఒప్పందమూ కలిస్తే సంబంధంగా మారుతుంది. నమ్మకం మాత్రమే ఉండి ఒప్పందం లేకపోతే పోటీదారులవుతారు. నమ్మకం, ఒప్పందం లేనిచోట ఇరువురూ శత్రువులుగా మిగిలిపోతారు. ఒప్పందం మాత్రమే ఉండి పరస్పరం నమ్మకం లేకున్నా అవకాశవాదులుగా ఉంటారు. సదుద్దేశ్యాలతోకూడిన నమ్మకం బంధాలను పెంచుతుంది. ఒప్పందం ఫలితాలను ఆవిష్కరిస్తుంది.

ఎలుక, పిల్లి ఆశ్రయంలో ఉండడం వల్ల పిల్లికి భయపడిన ముంగీస, గుడ్లగూబ పారిపోయాయి. 

ఇంతలో వేటగాడు వస్తూ కనిపించాడు. ఎలుక వలను వేగంగా కొఱికి తన కలుగులోకి వెళ్ళింది. పిల్లి పారిపోయింది. తెల్లవారి పిల్లి, ఎలుక కలుగు వద్దకు వచ్చి

“మిత్రమా! నా ప్రాణం కాపాడిన నీతో స్నేహాన్ని కోరుకుంటున్నాను. అంతేకాదు, నన్ను కాపాడిన నిన్ను ఆహారంగా స్వీకరించనని మాట ఇస్తున్నాను. నన్ను విశ్వసించి బయటికి రా” అని పిలిచింది. దానికి ఎలుక

“మిత్రమా! సహజ శత్రువులవద్ద మిత్రభావన పనికి రాదు. నువు కాకపోయినా నీ బంధువులవల్ల నాకు ప్రాణహాని ఉంటుంది. పరిస్థితులను అనుసరించి పరస్పరం సహకరించుకున్నాం, రక్షించుకు న్నాం. అంతే. నిన్న నేను ఆపదలో ఉన్నప్పుడు నువు నాకొక అవకాశం. నేడు నీవొక ప్రమాదానివి. అసమానుల మధ్య అవకాశాలు అడ్డంకులుగా, అడ్డంకులు అవకాశాలుగా మారుతాయి. సమానుల మధ్యే స్నేహం శోభిస్తుంది. ఇక ముందు మన మైత్రి కొనసాగదు” అంది.

ముంగీస, గుడ్లగూబలు కూడా ఎలుక కలుగును చూశాయి. ఏ నాటికైనా వాటితో తనకు ప్రమాదం ఉంటుందని భావించిన ఎలుక తనకది జన్మస్థానమనే అభిమానం ఉన్నా దానిని వదిలి మరొక చోటికి భార్యాపిల్లలతో వెళ్ళిపోయింది. 

సంకల్పంలో స్వచ్ఛత ఉండాలి!

ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకనాడు ఎలుక ఆహారానికై ఒక ఇంట్లోకి వెళ్ళి, వారు పెట్టిన బోనులో ఇరుక్కుపోయింది. బయటకు రాలేక భయంతో వణికిపోతూ ప్రాణాలపై ఆశలు వదులుకుంది. ఆ సమయంలో ఎలుక ముందొక భయంకరమైన పిల్లి ప్రత్యక్షమైంది. భయంతో వణికి పోతు న్న ఎలుకను ప్రేమతో సంబోధిస్తూ ఆ పిల్లి

“మిత్రమా! నన్ను గుర్తించావా? ఒకనా డు వలను కొఱికి నన్ను రక్షించావు. ఈనాడు నిన్ను రక్షించి నా ఋణం తీర్చుకుంటాను” అంటూ తన కాలితో ఆ బోను మూతను కొంచెం తెరచింది. ఎలుక బయటకు వచ్చిం ది. పిల్లి “మిత్రమా! నాపై, నా మైత్రిపై నీకు నమ్మకం లేదు కాబట్టి.. ఇక పారిపో” అంది. పిల్లిని విశ్వసించని తన అవివేకానికి చింతించిన ఎలుక పిల్లికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆ పిల్లి, ఎలుకతో “నువు నన్ను రక్షించావు. నేను నిన్ను రక్షించాను. పరస్పర సహకారం ఇరువురికీ ఉపకరించింది” అంది. దానికి ఎలుక 

“మిత్రమా! ఆనాడు పరస్పర రక్షణ అవసరాలకై ఇరువురం చేసుకున్న ఒప్పందమది. దానిని ఇరువురమూ గౌరవించాం. ఈనాడు మన మధ్య అలాంటి ఒప్పందమేదీ లేకున్నా నన్ను రక్షించిన నీ ఔదార్యం ప్రశంసార్హం” అంది. దానికి పిల్లి “నేను ఆనాడు నిన్ను చంపనని ప్రతిజ్ఞ చేసాను. ఆ ప్రతిజ్ఞను ఈనాటికీ గౌరవిస్తున్నాను. నిన్నే కాదు ఆనాటి నుంచి మరే ఎలుకనూ చంపలేదు” అంటూ ఎలుకను తనవీపుపై కూర్చో బెట్టుకొని బయటకు తీసుకు వెళుతుంది.

ఉదాత్తమైన వ్యక్తులు తామిచ్చిన మాట ను ప్రాణసమంగా భావిస్తారు. పరస్పర విశ్వాసం, ఒప్పందాలు భాగస్వామ్యంలో ఫలప్రదమవుతాయి. పరిస్థితుల ప్రాబల్యా న్ని అధిగమించిన స్వఛ్చమైన స్నేహం పరిమళిస్తుంది. సంకల్పాలు స్వఛ్చమైనప్పుడు భాగ స్వామ్యం పరిఢవిల్లుతుంది. అభ్యుదయం ఇరువురినీ ఆలింగనం చేసుకుంటుంది.