calender_icon.png 29 May, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆందోళన వద్దు

28-05-2025 12:34:55 AM

మొత్తం ధాన్యం కొంటాం.. రైతులకు సీఎం రేవంత్ హామీ‘

-రైతులను మిల్లర్లు, దళారులు ఇబ్బందిపెడితే కఠిన చర్యలు 

-భూభారతి పేద రైతులకు చుట్టం 

-3 నుంచి 20 వరకు మూడోదశ రెవెన్యూ సదస్సులు

-2న రాష్ట ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి 

- మంత్రులు, అధికారులతో కలిసి కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా రుతుపవనాలు 15 రోజులు ముందుగా వచ్చాయని, దానికి అనుగుణంగా సన్నద్ధమై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

వానలు ముందుగా రావడం వల్ల కొన్ని చోట్ల ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తాయని, రైతులు ఆందోళన చెందారని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని సీఎం భరోసా ఇచ్చారు. యాసంగిలో గతంలో ఎన్నడూ లేనంత ధాన్యాన్ని ప్రభుత్వం ఈసారి కొనుగోలు చేసిందన్నారు.

గత ఏడాది 42లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొంటే, ఈసారి ఇప్పటికే 64.50లక్షల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని సీఎం వివరించారు. హైదరాబాద్ కమాం డ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించామని, ఈ సీజన్‌లో ఇప్పటికే రూ.12,184 కోట్లు చెల్లించామన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఈ ఏడాది 2.75కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధించటం, మన రైతులు సాధించిన విజయమని అన్నారు.

ఇందులో భాగస్వామ్యం పంచుకున్న వ్యవసాయశాఖ, సివిల్ సప్లయీస్ విభాగాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మరో నాలుగైదు లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద మిగిలి ఉందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ర్పచారం చేసిన ఘటనను ఉదాహరించారు.

ఉద్దేశపూర్వకంగా విషప్రచారం చేసే వారిపై కేసులు పెట్టేందుకు వెనుకాడవద్దని సూచించారు. వానాకాలం ముందుగా వచ్చిందని, ఇప్పటికే ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉండటంతో రాష్ర్టంలో సుభిక్ష వాతావరణం ఉందని అన్నారు. సీజన్ ముందుకు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

సీజనల్ వ్యాధులు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని, వైద్యారోగ్య శాఖ అందుబాటులో ఉండాలన్నారు. ఎరువులు, విత్తనాలను బ్లాక్‌మార్కెట్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేసే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని చెప్పారు. 

3-20 వరకు రెవెన్యూ సదస్సులు.. 

గతంలో ధరణి రాష్ర్టంలో రైతుల పాలిట భూతంగా మారిందని, కొత్తగా ప్రజాప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం రైతులకు చుట్టంగా ఉందని సీఎం రేవంత్ అన్నారు. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయాలని, రైతుల సమస్యలకు పరిష్కారాలను సూచించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.

జూన్ 3 నుంచి 20 వరకు రాష్ర్టమంతటా మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోందని ముఖ్యమంత్రి కలెక్టర్ల కు దిశానిర్దేశం చేశారు. ఈనెలాఖరులోగా లబ్ధిదారుల తుది జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మండలస్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇసుక దందాతో లబ్ధిదారులు ఇబ్బందిపడకుండా ఉచిత ఇసుక కూపన్లను సకాలంలో అందించాలన్నారు. ఇటుకతయారీ, సెంట్రింగ్ యూనిట్ల తయారీకి ఇందిరా మహిళాశక్తి, రాజీవ్ యువ వికాసం ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు.  

29, 30వ తేదీల్లో ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లాలో పర్యటించాలి 

ఈనెల 29,30 తేదీల్లో జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. ధాన్యం సేకరణ, భూభారతి రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధ ప్రణాళికపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలని చెప్పారు. జూన్ 2న రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహిం చాలని ఆదేశించారు.

వీడియో కాన్పరెన్స్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ము ఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, కలెక్టర్లు పాల్గొన్నారు.