28-05-2025 12:22:37 AM
-పాక్ ప్రధాని షరీఫ్‌కు ఆర్మీ చీఫ్ బహూకరించిన ఫొటోపై చురకలు
-కాపీ కొట్టడం కూడా రాని జోకర్లంటూ..
-కువైట్ వేదికగా పాక్ నేతల పరువుదీసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
కువైట్, మే 27: ‘నకల్ కర్నే కే లియే అకల్ ఛాహియే’ (కాపీ కొట్టడానికైనా తెలివితేటలు అవసరం) అని పాకిస్థాన్ వైఖరిని ఎండగడుతూ అంతర్జాతీయ వేదికపై ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు.
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతిగా తాము ‘ఆపరేషన్ బున్యాన్ చేపట్టామని.. అందులో తాము విజయం సాధించినట్టు పాక్ చంకలు గుద్దుకోవడం చూస్తుంటే కనీసం కాపీ కొట్టడం కూడా రాని జోకర్లు, మూర్ఖులని ఘాటుగా విమర్శించారు.
పాకిస్థాన్ కుటిల నీతిని వివరించేందుకు భారత ప్రతినిధుల దౌత్య బృందం విదేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బీజేపీ ఎంపీ బైజయం త్ పండా నేతృత్వం వహిస్తున్న దౌత్య బృందం కువైట్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా భారత సంతతి పౌరులను ఉద్దేశించి మాట్లాడిన ఎంపీ ఒవైసీ పాక్ చేస్తున్న అబద్ధపు, అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు.
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతిస్పందనగా పాకిస్థాన్ ఆపరేషన్ బున్యాన్ ప్రారంభించింది. అయితే ఈ ఆపరేషన్‌లో పాక్ సైన్యం విజయం సాధించిందని చెబుతూ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పాక్ ప్రధాని షరీఫ్‌కు ఒక ఫొటోను జ్ఞాపికగా అందజేశారు. దీనిపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శనాస్త్రాలు సంధించారు.
‘ఈ తెలివి తక్కువ జోకర్లు భారత్‌తో పోటీ పడాలనుకుంటున్నారు. 2019 నాటి చైనా ఆర్మీ డ్రిల్ ఫోటోను చూపి భారత్‌పై విజయం సాధించినట్టు గర్వంగా చెప్పుకోవడం సిగ్గుచేటు. పాకిస్థాన్ ఇలాంటి నీచమైన పనులు చేయడంలో ముందు వరుసలో ఉంటుంది. కనీసం సరైన ఫోటోను కూడా బహుమతిగా ఇవ్వలేకపోయారు.
కాపీ కొట్టడానికైనా తెలివితేటలు అవసరం.. కానీ పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆ పని కూడా సరిగ్గా చేయలేని జోకర్లు.’ అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. పాక్ చేస్తున్న అసత్య ప్రచారాలను ఎవరు నమొద్దని ఈ సందర్భంగా ప్రవాస భారతీయులకు అసదుద్దీన్ ఒవైసీ సూచించారు.
వాస్తవానికి పాక్ ప్రధాని షరీఫ్‌కు ఆ దేశ ఆర్మీ చీఫ్ బహుకరించిన ఫోటో చైనా రూపకల్పన చేసిన పీహెచ్‌ఎల్ రకం బహుళ రాకెట్ లాంచర్ల వ్యవస్థకు సంబంధించిన పాత ఫోటో కావడం గమనార్హం. బీజేపీ ఎంపీ బైజయంత్ పండా నేతృత్వం వహిస్తున్న దౌత్య బృందంలో ఒవైసీతో పాటు పాటు గులాం నబీ ఆజాద్ పలువురు బృందంలో సభ్యులుగా ఉన్నారు.
పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది
పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనడానికి 26/11 ముంబై సూత్రధారి జాకీర్ రెహమాన్ ఉదంతం ఉదాహరణ అని అసదుద్దీన్ ఒవైసీ బహ్రెయిన్ సమావేశంలో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న కారణంగా పాక్ ప్రభుత్వం జాకీర్ రెహమాన్‌ను ఏడాదిగా జైళ్లో ఉన్నట్టు చూపెట్టిందన్నారు.
అయితే ఆయన జైళ్లో ఉండగానే రెహమాన్ భార్య బిడ్డకు జన్మనివ్వడం చూస్తే పాక్ కుటిల బుద్ధి ఏంటనేది బయటపడిందన్నారు. దీన్నిబట్టే పాకిస్థాన్‌లో లీగల్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందనేది తెలుస్తోందని దుయ్యబట్టారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ మతపరమైన అంశాలను లేవనెత్తిందని విమర్శించారు.
భారత్‌లో పాకిస్థాన్ కంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉందని, పాకిస్థాన్‌తో పోలిస్తే భారతీయ ముస్లింలు నిజాయితీపరులని పేర్కొన్నారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. భారత్‌లో ఒక్క ఉగ్రవాద శిబిరానైనా చూపగలరా అని ఆయన ప్రశ్నించారు.
దాయాది దేశం దాడులకు దిగితే భారత్ నుంచి ప్రతిదాడులు భీకరంగా ఉంటాయన్నారు. ప్రజల్ని మతం అడిగి మరీ హత్య చేయడమంటే అది ఇస్లామిక్ బోధనలను వక్రీకరించడమే అవుతుందని పేర్కొన్నారు. పాక్ తన సైనిక, ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడానికి 2 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ రుణాన్ని ఉపయోగించినట్టు ఆరోపణలు వచ్చాయన్నారు.
అందుకే పాకిస్థాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో చేర్చేలా అన్ని దేశాల వద్ద ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. కువైట్‌లోని భారతీయ ప్రవాసీయులు దీనికి మద్దతు తెలపాలని కోరారు.