28-05-2025 02:00:27 AM
ముందస్తుగా వచ్చిన నైరుతి ఋతు పవనాలు దక్షిణాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సాన్ని తెచ్చాయి. ముఖ్యంగా ముంబై మహానగరం అల్లకల్లోలమైంది. 75 ఏళ్లలో ఇలా నైరుతి వారం, పది రోజుల ముందే రావడం ఇదే ప్రథమం. దేశంలో 70 శాతం వర్షపాతాన్ని నైరుతి ఋతు పవనాలే అందిస్తుంటాయి. వ్యవసాయం, తాగునీరు, జీవనోపాధికి ఈ నైరుతి ఋతు పవనాలు కీలకం. దక్షిణాది రాష్ట్రాలను ముందుగా తాకే ఈ ఋతు పవనాలు ప్రతి ఏటా తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.
చెట్లు విరిగి పడి, గోడలు కూలి పట్టణాల్లో, నగరాల్లో రోడ్లు, బస్తీలు జలమయమై ప్రజలు అరిగోస పడటం మామూలైంది. రైల్వే ట్రాకులు, రన్‌వేలపై నీరు చేరి రవాణా అస్తవ్యస్తమవుతుండటం కూడా సాధారణమైంది. ఈ ఏడాది ఋతు పవనాల ఆగమనం కూడా మహారాష్ట్ర, కేరళలో భారీ వర్షాలనే తెచ్చింది. కేరళలో 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించగా, ముంబై, థానె, కొంకన్ ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు చేశారు.
వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేరళలో ఉరుములు, మెరుపులతో కొండ ప్రాంతాల్లోని జిల్లాల్లో బీతావహాన్ని సృష్టించిన భారీ వర్షాలకు ఇప్పటికి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని వాయనాడు జిల్లాలో కొండ చరియలు విరిగి పడి, ఇళ్లు కూలి ప్రజలు బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు. తెలంగాణలో రెండు వారాల ముందే ప్రవేశించిన నైరుతి నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ముందుగా వర్షం తెచ్చింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా తోడైతే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. వాతావరణ మార్పుల వల్ల సీజన్లలో వస్తున్న మార్పు ఈ ఏడాది చాలాచోట్ల అకాల వర్షాలను తెచ్చింది. కొద్ది గంటల్లోనే భారీగా వర్షపాతం నమోదు కావడం మొదలైంది. నగరాల్లో ఊహించని విధంగా వచ్చిన ఈ అకాల వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
వాతావరణ మార్పువల్ల తీవ్ర ఉష్ణోగ్రతలు భరించాల్సి రావడం ఒక ఎత్తయితే, పొంతన లేకుండా భారీ వర్షపాతాలతో తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తున్నది. వాతావరణ మార్పులతో ఆఫ్రికాలోని పలు దేశాలు ఇప్పటికే సతమతమవుతు న్నాయి. భూగోళం విపరీతంగా వేడెక్కడం ప్రధాన కారణంగా పరిణ మిస్తున్న ఈ వాతావరణ మార్పులు సునామీలు మొదలుకొని అడవు లు దహించుకు పోవడం వరకు మానవాళికి పెను సవాళ్లను ముందుం చాయి.
దక్షిణాసియాలో కొన్నేళ్లుగా ఋతు పవనాల మీద ఆధారపడి వున్న వ్యవసాయంపైన వాతావరణ మార్పులు పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ మార్పు కొన్ని ప్రాంతాల్లో కరువును తెచ్చి పెడు తుండగా, ఇంకొన్ని ప్రాంతాలను అధిక వర్షపాతానికి గురి చేస్తున్నది. అత్యధిక వర్షపాతం వల్ల లాభాలకంటే నష్టాలే అధికమవుతున్న పరిస్థి తులు వచ్చాయి.
వాతావరణ అంచనాల్లో మనం ఎంత పురోగతి సాధిం చినా చివరికి ప్రకృతి ముందు తల వంచే స్థితి కొనసాగుతున్నది. పట్టణా లు, నగరాల్లో కొన్ని ప్రాంతాలు కొద్ది రోజులపాటు నీటిలోనే మునిగి వుండే పరిస్థితులు నెలకొన్నాయి.