31-01-2026 01:54:28 AM
మంచిర్యాల టౌన్ / లక్షెట్టిపేట టౌన్, (విజయక్రాంతి): సమ్మక్క - సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శుక్రవారం తరలివచ్చారు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి శివారులో వెలిసిన సమ్మక్క - సారలమ్మ గద్దెల వద్దకు, అటు లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాల శివారులోని గోదావరి తీరాన వెలసిన సమ్మక్క - సారక్కలను, మందమర్రి మండలంలోని ఆర్కే 5 గని వద్ద వెలిసిన అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున గద్దెల వద్దకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారం పంచిపెట్టారు. కోళ్లు, మేకలతో మొక్కులు పెట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతర కమిటీ త్రాగునీటి సదుపాయం, నీడ కోసం టెంట్లు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయగా, పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించారు.