26-07-2025 06:31:06 PM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సి.ఆర్.టి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి(District Additional Collector Deepak Tiwari) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో పరీక్షల ముఖ్య పర్యవేక్షకులు, శాఖ అధికారులు, పరిశీలకులు, సెట్టింగ్ స్క్వాడ్, రూట్ అధికారులు, ఇన్విజిలేటర్లతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలలో ఒప్పంద ప్రాతపదికన కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సి. ఆర్. టి.) పోస్టులకు నిర్వహించే పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... సి. ఆర్. టి. పరీక్షల కొరకు జిల్లా కేంద్రంలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష ఉంటుందని, సుమారు 1 వేయి 137 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు తరలించడం జరుగుతుందని, పరీక్షల నిర్వహణ కొరకు విధులు కేటాయించిన అధికారులు తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ చేతి గడియారాలు, సెల్ ఫోన్ లకు పరీక్షా కేంద్రంలోనికి అనుమతి ఉండదని, పరీక్ష కేంద్రంలో ఫర్నిచర్, వెలుతురు, ఫ్యాన్లు సౌకర్యాలు కల్పించాలని, త్రాగునీరు, పారిశుధ్యం పకడ్బందీగా చేపట్టాలని, వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
విద్యుత్ కోత లేకుండా చూడాలని, పరీక్ష సమయానికి అనుగుణంగా ఆర్. టి. సి. అధికారులు బస్సులు నడిపించాలని, పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు కల్పించాలని తెలిపారు. పరీక్షా నిర్వహణలో ఎలాంటి కోపం జరగకుండా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, ఇంచార్జ్ విద్యాధికారి ఉదయ్ బాబు, మున్సిపల్ కమిషనర్ గజానన్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.