12-08-2025 01:40:17 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): సైబర్ నేరాలకు పాల్పడే నిందితుల సిమ్ కార్డులను తక్షణమే బ్లాక్ చేసే అధికారాన్ని జిల్లా ఎస్పీలకు కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. దీంతోపాటు నేర అనుమానితుల ఖచ్చితమైన లొకేషన్లను, బ్యాంకింగ్, టెలికామ్ వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అందించేందుకు తగిన చర్యలు తీసుకోనుంది.
దీంతోపాటు సైబర్ మోసాలు రోజురోజుకూ అధికమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైబర్ విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో తెలంగాణను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిర్ణయించారు. త్వరలోనే తెలంగాణలో ఈ అంశంపై సెమినార్ ఏర్పాటు చేస్తామన్నారు.
సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో కేంద్రమంత్రి బండి సంజయ్, హోంశాఖ ఉన్నతాధికారులతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో అమలులోకి తెచ్చిన సమన్వయ్ ప్లాట్‌ఫామ్, సైబర్ కమాండో ప్రోగ్రామ్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయ ప్లాట్ ఫామ్, సైబర్ కమాండో ప్రోగ్రామ్ అమలు తీరు, ప్రయోజనాలను హోంశాఖ అధికారులు మంత్రికి వివరించారు.
వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాల మధ్య సమన్వయం కోసం ‘సమన్వయ్ ప్లాట్‌ఫామ్’ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సైబర్ నేర అనుమానితుల ఖచ్చితమైన లొకేషన్లతోపాటు వారు ఉపయోగించే బ్యాంకింగ్, టెలికామ్ వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు వెంటనే పంపించేందుకు ‘ప్రతిబింబ్ మాడ్యూల్’ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
‘సైబర్ క్రైమ్ ఇంటర్ స్టేట్ అసిస్టెన్స్ రిక్వెస్ట్ మాడ్యూల్’ ద్వారా ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు సైబర్ క్రైమ్ కేసుల్లో పరస్పర సహాయం అందించొచ్చని వివరించారు. ఆయా నేరాలకు ఉపయోగించిన సిమ్‌కార్డులను, ఎలక్ట్రానిక్ పరికరాలను తక్షణమే బ్లాక్ చేసేలా ఎస్పీలకు సదుపాయం కల్పిస్తోందని వివరించారు.
బ్యాంకింగ్ మాడ్యూల్ ద్వారా దర్యాప్తు అధికారులు బ్యాంక్ సీసీ టీవీ ఫుటేజీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లను వేగంగా పొందొచ్చని తెలిపారు. క్లిష్టమైన కేసుల్లో దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు, అలాగే విచారణకు అవసరమైన టూల్స్‌ను అందుబాటులో ఉంచడానికి ప్రత్యేకంగా టెక్నో -లీగల్ సపోర్ట్ సర్వీస్‌ను రూపొందించినట్టు పేర్కొన్నారు.