calender_icon.png 12 August, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా భద్రతే ప్రథమం

12-08-2025 01:36:07 AM

-ఢిల్లీ -ఎన్‌సీఆర్‌లో 8 వారాల్లోగా వీధి కుక్కలన్నీ షెల్టర్లకే తరలించాలి

-జంతు ప్రేమికులు, సంస్థలు అడ్డుకుంటే కఠిన చర్యలు

- సుప్రీంకోర్టు సంచలన తీర్పు

-హైదరాబాద్‌లోనూ కుక్కల బెడద

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): ప్రజా భద్రతకు మిం చింది ఏదీ లేదని తేల్చిచెప్పిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. వీధి కుక్కల బెడదపై చారిత్రక తీర్పు వెలువరించింది. దేశ రాజధాని ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) పరిధిలోని ప్రతీ వీధి కుక్కను 8 వా రాల్లోగా గుర్తించి, శాశ్వత షెల్టర్ హోమ్‌లకు తరలించాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

ఈ ప్రక్రియను అడ్డుకునే జంతు ప్రేమికులు, సంస్థల పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రేబిస్ మరణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం, “రేబిస్‌తో చనిపోయిన వారిని జంతు హక్కుల కార్యకర్తలు తిరిగి తీసుకురాగలరా? అని ఘాటుగా ప్రశ్నించింది. అయితే ఈ తీర్పు ప్రస్తుతానికి ఢిల్లీకే పరిమితమైనా, దీని ప్రభావం హైదరాబాద్‌పై తీవ్రంగా పడనుంది. 

భాగ్యనగరిలో భయానకం

హైదరాబాద్ పరిస్థితి ఢిల్లీకి ఏమాత్రం తీసిపోదు. బడికి వెళ్లే చిన్నారుల నుంచి, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల వరకు, మార్నింగ్ వాక్‌కు వెళ్లే వృద్ధుల వరకు వీధి కుక్కల కాటుకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులను వెంబడించి ప్రమాదాలకు గురిచేయడం, ఒంటరిగా వెళ్లేవారిపై గుంపులుగా దాడి చేయడం నగరంలో నిత్యకృత్యమైంది. 4 లక్షల శునకాలు జీహెఎంసీ పరిధిలో రోడ్లపై తిరుగుతున్నట్లు అంచనా. గత మూడేళ్లలో 1,10,057 కాట్లు, 36 మంది రేబిస్‌తో మరణాలు సంభవించినట్టు లెక్కలున్నాయి. కేవలం 2022 మధ్య కుక్కకాటు కేసులు 35శాతం పెరిగాయి. 

పరిష్కారం ఎక్కడ?

ఈ సమస్యపై జీహెఎంసీ తీసుకుంటున్న చర్యలు ఏ మూలకూ సరిపోవడం లేదు. కుక్కల జనాభా నియంత్రణకు యానిమల్ బర్త్ కంట్రోల్  కార్యక్రమం ఏళ్లుగా కొనసాగుతున్నా, వాటి సంఖ్య పెరుగుదలకు, ఈ కార్యక్రమ వేగానికి పొంతన కుదరడం లేదు. పట్టుకున్న కుక్కలను తిరిగి అవే వీధుల్లో వదిలేస్తుండటంతో సమస్య మళ్లీ మొదటికొస్తోం దని సుప్రీంకోర్టు కూడా తన తీర్పులో తప్పుబట్టింది. ఫిర్యాదుల కోసం జీహెఎంసీ హెల్ప్ లైన్, ప్రత్యేక యాప్‌లను ఏర్పాటు చేసినా, క్షేత్రస్థాయిలో స్పందన కరువవుతోంది. తీవ్రంగా దాడి చేసే, పిచ్చికుక్కలకు ‘యూథనేషియా’ (కారుణ్య మరణం) ప్రయోగిం చేందుకు అనుమతివ్వాలని జీహెఎంసీ హైకోర్టును ఆశ్రయించింది. లక్షల కుక్కలను షెల్టర్ల కు తరలించడమనేది అత్యం త వ్యయప్రయాసలతో కూడుకున్నది. దీనికి వేల ఎకరాల భూమి, నిధులు, సిబ్బంది అవసరం. కానీ, సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది

సుప్రీంకోర్టు తీర్పును ఒక మేల్కొలుపుగా భావించి, హైదరాబాద్‌లో కుక్కల నివారణకు రాష్ర్ట ప్రభుత్వం, జీహెఎంసీ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలి. నగర శివార్లలో ప్రభుత్వ భూములను గుర్తించి, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో భారీ షెల్టర్ జోన్‌లను ఏర్పాటు చేయాలి. జంతు ప్రేమ తప్పు కాదు, కానీ ఆ ప్రేమ మానవ ప్రాణాలను బలితీసుకునేంత గుడ్డిగా ఉండకూడదు. ప్రజా భద్రతకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న సుప్రీం స్ఫూర్తితో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.

 కంచిరాజు కాశీనాథ్, చైర్మన్, హైదరాబాద్ డెవలప్‌మెంట్ కమిటీ