calender_icon.png 26 November, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వండి

26-11-2025 12:45:16 AM

-మంత్రులు సీతక్క, తుమ్మల, పొన్నం ప్రభాకర్‌లను కోరిన రాష్ట్ర పెరిక సంఘం నూతన కార్యవర్గం

-నాయకులను సత్కరించిన మంత్రులు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ, వ్యవసాయ రంగాల్లో స్వయంకృషితో రాణిస్తున్న పెరిక పురగిరి క్షత్రియ కులస్తులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు ప్రభు త్వాన్ని కోరారు. ఇటీవలే ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి ముత్తయ్య నేతృత్వంలో నూతన కార్యవర్గం మంగళవారం హైదరాబాద్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్కలను వేర్వేరుగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రులు.. సంఘం కొత్త అధ్యక్షుడు ముత్తయ్యతో పాటు రాష్ట్ర కమిటీ నాయకులను శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. మంత్రులతో జరిగిన చర్చల్లో సంఘం నాయకులు పలు కీలక విజ్ఞప్తులు చేశారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పెరిక కులస్తుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ఇతోధికంగా సాయం అందించాలని కోరారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి తగినన్ని టికెట్లు కేటాయించాలని, అలాగే ప్రభుత్వ పరంగా భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో పెరిక కులస్తులకు అవకాశాలు కల్పిం చాలని విన్నవించారు.

దీనిపై మంత్రు లు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో పెరిక కుల సంఘం రాష్ట్రకార్య నిర్వాహక అధ్యక్షుడు ధనేకుల కృష్ణ, ముఖ్య సలహాదారులు చింతం లక్ష్మీనారాయణ, డాక్టర్ సంగని మల్లేశ్వర్, అసోసియేట్ అధ్యక్షుడు కోట మల్లికార్జున్, ఆక రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి రంగారావు, ఇతర నేతలు అంకత మల్లికార్జునరావు, బోడకుంటి సుధాకర్, సాయిని నరేందర్, అంకత ఉమామహేశ్వర్ రావు, బుయ్యాని శివకుమార్, శ్రీధర్ల జగదీశ్వర్, గంప నాగరాజు, యర్రంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.