26-11-2025 12:43:56 AM
-లక్ష డాలర్లతో కరేబియన్ దీవుల పౌరసత్వం
- వారానికో దేశానికి టూర్
- ఐ-బొమ్మ రవి భార్య మాకు సమాచారం ఇవ్వలేదు
- మీడియా సమావేశంలో అడిషనల్ సీపీ శ్రీనివాస్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): సినీ పరిశ్రమను కుదిపేసిన ఐ-బొమ్మ పైరసీ వెబ్‌సైట్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ రవి వారానికో దేశం టూర్ వేసేవాడని, లక్ష డాలర్లతో కరేబియన్ దీవుల పౌరసత్వం కూడా పొందాడని మంగళవారం నిర్వహించిన మీడియా సమావే శంలో సైబర్‌క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ వెల్లడించారు. పైరసీ ద్వారా రవి ఏకంగా రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘ఐ-బొమ్మ వెబ్‌సైట్ నిర్వహణకు రవి పక్కా ప్లాన్ వేశాడు. ఎన్‌జల అనే సంస్థలో డొమైన్‌ను రిజిస్టర్ చేయించి, మరో కంపెనీ నుంచి వెబ్‌సైట్‌ను హోస్ట్ చేస్తున్నాడు. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను అప్‌లోడ్ చేసేవాడు. కేవలం ఐ-బొమ్మ మాత్రమే కాకుండా బప్పం అనే మరో వెబ్‌సైట్‌ను కూడా ఇతనే నడిపేవాడు. ఈ సైట్లలో రీ-డైరెక్ట్ స్క్రిప్ట్‌లు రాసి, యూజర్లు క్లిక్ చేయగానే గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లకు వెళ్లేలా సెటప్ చేశాడు.
ఆయా కంపెనీల నుం చి భారీగా కమిషన్లు దండుకున్నాడు. ఈజీ మనీకి అలవాటు పడ్డ రవి.. విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. చట్టానికి దొర క్కుండా ఉండేందుకు ఏకంగా లక్ష డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వాన్ని కొనుగోలు చేశాడు. ఒంటరిగా ఉంటూనే వారానికో దేశం తిరుగుతూ ఎంజాయ్ చేసేవాడు. ఇతనికి నిఖిల్ అనే మరో వ్యక్తి వెబ్‌సైట్ పోస్టర్లు డిజైన్ చేస్తూ సహకరించేవాడు. ఐ-బొమ్మ రవి ఆచూకీని అతని భార్యే పోలీసులకు తెలిపిందన్న ప్రచారంలో నిజంలేదు.
రవి భార్య మాకు ఎలాం టి సమా చారం ఇవ్వలేదు, ఆమెను మేము విచారించలేదు. రవి అతి విశ్వాసంతోనే దొరికిపో యాడు. ప్రస్తుతం మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ వంటి పైరసీ సైట్లు ఇంకా నడుస్తున్నాయని, వాటి నిర్వాహకుల కోసం గాలిస్తున్నాం’ అని సీపీ తెలిపారు. అయితే, భవిష్యత్‌లో రాబో యే వెబ్-3 టెక్నాలజీ ద్వారా పైరసీ చేస్తే నేరస్తులను పట్టుకోవడం చాలా క్లిష్టంగా మారు తుందని ఆందోళన వ్యక్తం చేశారు.