calender_icon.png 5 October, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతలాకుతలమైన ఏడుపాయల..

05-10-2025 04:48:07 PM

మంజీరా వరద ప్రవాహంతో నష్టం

ప్రవాహంలో కొట్టుకుపోయిన ప్రసాదం కౌంటర్, ఆలయం ముందు రేకులు

తీవ్రంగా ధ్వంసమైన గ్రిల్స్ 

పాపన్నపేట (విజయక్రాంతి): మంజీరా ఉదృతి ఏడుపాయల ఆలయానికి నష్టం మిగిల్చింది. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం చెంత ఎన్నడూ లేని విధంగా ఈసారి వరద ఉధృతి విపరీతంగా కొనసాగింది. 2016 తర్వాత ఈసారి రికార్డు స్థాయిలో 50 రోజుల పాటు ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు వన దుర్గమ్మ దర్శనం కల్పించారు. వరద ఉధృతి విపరీతంగా ఉండటంతో వనదుర్గమ్మ ప్రధాన ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీపాయ ఉధృతంగా ప్రవహించింది.

దీంతో ప్రసాదం విక్రయ కేంద్రం షెడ్డు, ఆలయం ముందు రేకులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అమ్మ వారి ప్రధాన ఆలయం మండపం గ్రిల్స్, జాలీలు, యాగశాల గ్రిల్స్, క్యూ లైన్ గ్రిల్స్, రేకులు, గ్రానైట్ బండలు, టైల్స్ పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. పైనుంచి వరద ప్రవాహంలో కొట్టుకు వచ్చిన వ్యర్ధాలు, చెట్ల కొమ్మలు ఆలయం మండపం గ్రిల్స్ కు తట్టుకొని పేరుకుపోయాయి. ఆదివారం ఉదయం వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఆలయ సిబ్బంది ఆలయంలోకి ప్రవేశించి వరద వల్ల ఏర్పడిన నష్టాన్ని పరిశీలించారు.