01-11-2025 12:00:00 AM
నేరేడుచర్ల, అక్టోబర్ 31: తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 54006 ఎకరాల వరి పంటకు, 10922 ఎకరాల పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామంలో తుఫాన్ కారణంగా నష్టపోయిన వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులకు 42,627 ఎకరాల వరి పంట నేలకొరకగా, 11,379 వేల ఎకరాలు నీట మునిగి నష్టం వాటిల్లినట్టు వివరించారు. జిల్లాలో నేటి నుండి గ్రామాల వారీగా పంట నష్టం వివరాల సర్వే చేపట్టినట్లు వెల్లడించారు.
అధిక వర్షాల వలన వరి పంటకు జరిగే నష్ట తీవ్రతను తగ్గించేందుకు పాలు పోసుకునే దశలో వర్షాల వలన చేను పడిపోతే మొదటగా పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలని, వీలును బట్టి పడిపోయిన చేలు పైకి లేపి కట్టుకోవాలని , నిలబడి ఉన్నా పడిపోయిన చేలలో గింజలు రంగు మారడం, మాగుడు తెగులు, మానిపండు తెగులు వ్యాప్తి నివారించడానికి ఎకరానికి 200 మిల్లీలీటర్ల ప్రోపికొనజోల్ మందును పిచికారి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి షేక్. జావేద్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.