05-10-2025 12:22:03 AM
-అధికారిక లాంఛనాలతో పూర్తి
-పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, ఎమ్మెల్యేలు
తుంగతుర్తి, అక్టోబర్ 4: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండ ల కేంద్రంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అశేష ప్రజానికం మధ్య తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంతరావు, ఎమ్మెల్యేలు హాజరై.. దామోదర్‌రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళుల్పించారు. ఆయన కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డిని ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ.. దామోదర్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు, అభిమానులు పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి ఘటించారు.
కాగా 1952లో ఖమ్మం జిల్లాలో జన్మించిన దామోదర్‌రెడ్డి 1969 సంవత్సరం నాటికే రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదిగారు. 1986లో మొట్టమొదటిసారిగా తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచి కమ్యూనిస్టులతో పోరాడి గెలిచారు. మొత్తం 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 2 మార్లు మంత్రిగా పనిచేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో వేల కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేసిన ఘనత దామోదర్‌రెడ్డికి దక్కింది. గడిచిన 40 సంవత్సరాలుగా ఎంతోమంది కార్యకర్తలు, రాజకీయ నాయకులుగా తీర్చిది ద్దడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. కాగా ఎమ్మెల్యేలు మందుల సామే లు, వేముల వీరేశం, యశస్వినిరెడ్డి, రవీందర్ నాయక్, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సత్యం, కోటిరెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి రేఖ, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్‌రావు, సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.