11-09-2024 12:00:00 AM
ఆదిలాబాద్ జిల్లాలో మరొక ముఖ్యమైన తెగ కోలామీలు. వీళ్లు ద్రావిడ భాష కుటుంబానికి చెందిన కోలామీ భాషను మాట్లాడతారు. తమను తాము “కోలవార్” అని పిలుచుకుంటారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌లో కూడా కోలామీలు నివసిస్తున్నారు. “కోలా” అంటే కర్ర అని అర్థం. వీళ్లు నివసించే ప్రాంతంలో వెదురు చెట్లు ఎక్కువగా లభిస్తాయి. వెదురు బొంగుల్ని ఉపయోగించి ఎంతో నైపుణ్యంతో బుట్టలు, మంచి కళాత్మకమైన వస్తువులు, కంచెలు మొదలైన వాటిని తయారు చేస్తారు.
కొలామీలు ప్రత్యేకమైన జీవనశైలిని సంస్కృతిని, సంప్రదాయాలను నిలుపుకుంటూ జీవిస్తున్నారు. కోలామీలు గోండుల మాదిరి గుస్సాడి దండారి నృత్యాలను ప్రదర్శిస్తారు. వారి నృత్యాలు ఒకే విధంగా ఉంటాయి. అయితే వారు ధరించే తలపాగాలలో మాత్రమే భేదం కనిపిస్తుంది. గోండుల తలపాగా నెమలి ఈకలు నిలువుగా తీర్చబడి, అద్దాలు పూసలతో అద్భుతంగా అలంకరించబడి ఉంటుంది. కానీ కొలామీల తలపాగా నెమలి ఈకలతో సమతలంగా తయారు చేయబడి ఉంటుంది. దీనికి ఇతర అలంకరణలేమి ఉండవు. గుస్సాడి దండారి నృత్య ప్రదర్శనలో తేడా ఏమీ ఉండదు.
ఘోర్పాడ్ కోలామీ నృత్యం
ఘోర్పాడ్ అంటే ఉడుము వేట. కొలామీలు ఉడుములను ఆహారంగా తింటారు. వైద్యానికి కూడా వాడుకుంటారు. దీనిలో ఉండే కొవ్వును కీళ్ల నొప్పులకు మందుగా వాడుకుంటారు. ఉడుమును వేటాడిన తర్వాత వారు విందు చేసుకుంటారు. అప్పుడు పది నుంచి పదిహేను మంది కళాకారులు ఉడుమును వేటాతాడుతున్నట్లు నృత్య ప్రదర్శన చేస్తారు. కొలామీ స్త్రీలు కొప్పులో పువ్వులను, పురుషులు తలలో నెమలి ఈకలను పెట్టుకొని రంగురంగుల వస్త్రాలను ధరించి, గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తారు.
దీనికి డోలు సహకార వాద్యం. డోలు ధ్వనికి అనుగుణంగా వారు అడుగులను మార్చుతూ నృత్యం చేస్తారు. డోలుతో పాటు తాళాలను కూడా లయబద్దంగా వాడుతారు. ఒక్కొక్కసారి సన్నాయిని కూడా వాయిస్తారు. ఉడుము నడకలను అనుకరిస్తూ నృత్యం చేసే పురుషుడు చిన్న వస్త్రాన్ని ధరిస్తాడు. మిగిలిన శరీరమంతా ఖాళీగా ఉంటుంది. ఉడుము నడకలను సహజంగా అనుకరిస్తూ నృత్య ప్రదర్శన చేసే వ్యక్తి చుట్టూ మిగిలిన కళాకారులు కర్రలను పట్టుకుని తిరుగుతూ నటిస్తారు.
రేలా నృత్యం
రేలా నృత్య ప్రదర్శనలో కొలామీ స్త్రీ, పురుషులిద్దరూ పాల్గొంటారు. ఇందులో స్త్రీల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. దీపావళి పండుగకు దీన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యకళాకారులు తాము ఏ పాత్రను అభినయిస్తారో ఆ పాత్రల ముఖాకృతుల “పాపియర్ మాచె మాస్క్” లను ధరిస్తారు. వారు ఒకరి చేతులను ఒకరు పట్టుకొని ఎడమవైపుకు తిరుగుతూ గుండ్రంగా సంగీతానికి అనుగుణంగా అడుగులు వేస్తారు.
చౌతాలి నృత్యం
ఈ చౌతాలి నృత్యం కూడా దీపావళి పండుగ సందర్భంగా ప్రదర్శిస్తారు. దీనిలో పురుషులు మాత్రమే పాల్గొంటారు. స్త్రీ, పురుషుల వేషధారణను పురుషులే ధరించి నృత్య ప్రదర్శనలో పాల్గొంటారు. డోలక్ సన్నాయి వాద్యాలు పాటకు సహకారం అందిస్తాయి. ఈ నృత్య కళాకారులు గుండ్రంగా తిరుగుతూ ఒక చేతిలో కర్రలను ఊపుతూ, ఇంకొక చేతిలో రంగురంగుల గుడ్డలను పట్టుకొని ఊపుతూ నృత్య ప్రదర్శన చేస్తారు.
చౌతాలి అదిం
చౌతాలి అదిం అనే నృత్యం ఆదిమజాతి ఆటవిక దుస్తులతో నృత్య ప్రదర్శన చేస్తారు. ఈ కళాకారులు ఆకులతో చేసిన అంగీలను ధరించి, ముఖానికి తెల్లని రంగు పూసుకొని ప్రదర్శన చేస్తారు. ఈ నృత్యం ఆటవికుల దృఢత్వానికి, ఆకర్షణీయమైన అలంకరణకు, అందమైన పాటలకు ప్రసిద్ధమైనది. అన్ని పండగలలో దీన్ని కోలామీలు ప్రదర్శిస్తారు.
లహన్ దండార్, మోటా దండార్
లహన్ దండార్‌లో కొద్దిమంది కళాకారులు దండారి నృత్యం చేస్తారు. మోటా దండార్‌లో చాలామంది నృత్య ప్రదర్శనలో పాల్గొంటారు. కళాకారులు సంగీతానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తారు. ఈ నృత్యాలను చలికాలంలో ప్రదర్శిస్తారు.
దింసా కోలా
దింసా కోలా నృత్యాన్ని కొలామీల తమ ఉల్లాసం కోసం అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు. ఇది చాలా నైపుణ్యంతోను, నేర్పుతోను, బల ప్రదర్శనలతోనూ, విన్యాసాలతో కూడిన నృత్య ప్రదర్శన. చలికాలంలో వచ్చే పండగలలో కూడా ఈ విన్యాసాలను కొలామీలు ప్రదర్శిస్తారు.