calender_icon.png 17 May, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తనాన్ని సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ముఖ్యమైనది

17-05-2025 05:37:50 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

నల్లగొండ (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనాన్ని సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. విత్తనం విషయంలో డీలర్లు రైతులను ప్రలోభాలకు గురిచేయవద్దని పారదర్శకత పాటించాలని, ఒకవేళ రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తన డీలర్లు తప్పనిసరిగా షాపు ముందు ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలకు విత్తనాలను అమ్మే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ఖచ్చితంగా ఎమ్మార్పీ ధరకే  విత్తనాలను ఆమ్మాలని చెప్పారు.

అలాగే నకిలీ విత్తనాలను, ఇతర ప్రాంతాల నుండి వచ్చి విత్తనాలను అమ్మేవారిని ప్రోత్సహించవద్దని, రైతులకు విత్తనాలను అందించడంలో ఒక డీలర్ గా కాకుండా, సాటి మనిషిగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రబీ సీజన్లో రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించిన రెండవ జిల్లాగా నల్గొండ నిలిచిందని, వ్యవసాయ, ఇరిగేషన్, అనుబంధ శాఖలు, డీలర్ల సహకారంతోనే ఇది సాధ్యమైందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఈ రబి సీజన్లో 5 లక్షల 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 5 లక్షల 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, కోరమండల్ ఎరువుల కంపెనీ సిజిఎం వెంకటేశ్వర్లు, విత్తన డీలర్ల సంఘం అధ్యక్షులు నాగేశ్వర రావు, రామ్మూర్తి, రవి, రాజేందర్, హర్ష, తదితరులు పాల్గొన్నారు.