16-08-2025 12:00:00 AM
హిమాలయ పర్వత సానువుల్లో ఈ ఏడాది వర్షాకాలం మృత్యుఘంటికల్ని మోగిస్తున్నది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో మేఘ విస్ఫోటం, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం నిత్యకృత్యమైంది. కశ్మీర్‌లోని కిష్టార్ జిల్లా చసోతి గ్రామంలో గురువారం ఆకస్మిక వరదలు బీభత్సాన్ని సృష్టించాయి.
మాచైల్ మాత ఆలయాన్ని దర్శించుకొనేందుకు వచ్చిన యాత్రికులు బేస్ పాయింట్‌లో ఉండగా సంభవించిన ప్రకృతి విలయానికి ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆకస్మిక వరదల్లో కొండలపై నుంచి జారిన బురదలో కూరుకుపోయినవారిని కాపాడటం తలకు మించిన భారం అవుతుంది. 9,500 అడుగుల ఎత్తున ఉండే మాచైల్ మాత ఆలయాన్ని చేరుకోవాలంటే చసోతి గ్రామం వరకే వాహనాల్లో వచ్చే వీలుంటుంది.
ఆపైన కొండరాళ్ల దారిలో నడిచి వెళ్లాల్సిందే. ఏడాదికి ఒకసారి జరిగే మాచైల్ మాత యాత్రకు వందలాది మంది భక్తులు వస్తుంటారు. అక్కడ గస్తీ కాస్తున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిలో ఇద్దరు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మంది గురువారం మధ్యాహ్నం ఆ బేస్ క్యాంప్‌లో ఉండగా, ఆకస్మిక వరదల్లో అనేక మంది జాడ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. వారి కోసం సహాయ బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి.
పది రోజుల క్రితం ఉత్తరకాశీలోని ధరాలీ గ్రామంలో మేఘ విస్ఫోటంతో ఉప్పెనలా వచ్చిన వరద గ్రామాన్ని మింగేసింది. మేట వేసిన బురద కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సైన్యం అహర్నిశలు శ్రమించాల్సి వచ్చింది. గ్రామంలోని ఇండ్లు, దుకాణాలు, హోటళ్లు కళ్లముందు చూస్తుండగానే వరదల్లో కొట్టుకుపోయాయి. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా తుడిచి పెట్టుకొని పోవడం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది.
మేఘ విస్ఫోటం ఈ వరదలకు కారణమై ఉండదని, కొండల్లోని సరస్సు కట్ట తెగి విరుచుకుపడి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఇండ్లు, రోడ్లనే కాదు, శతాబ్దాల చరిత్ర ఉన్న కేదార్‌నాథ్ ఆలయం కూడా ఈ వరదల్లో కనుమరుగైంది. ఈ దుర్ఘటనలో వంద మంది వరకు ప్రాణాలు కోల్పోగా, వైమానిక దళం దాదాపు 2,500 మందిని బురద నుంచి కాపాడింది. 25 అడుగుల మేర విరిగిపడ్డ కొండచరియలు, బురద పేరుకుపోయి సహాయచర్యలు చేపట్టేందుకు కూడా కష్టమైంది.
రుద్రప్రయాగ్ జిల్లాలో జూలై చివరి వారంలో కూడా ప్రకృతి ప్రకోపించింది. అగస్త్యముని బ్లాక్‌లోని రుమ్సి గ్రామంలో, బీజానగర్‌తో పాటు అనేక గ్రామాల్లోని ఇండ్లు.. మట్టి, రాళ్లతో కప్పబడ్డాయి.కొండచరియలు విరిగిపడి కేదార్‌నాథ్ మార్గం మూసుకుపోయింది. చార్‌ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌కు వెళ్లేందుకు వేచివున్న దాదాపు 1600 మంది యాత్రికుల్ని అధికారులు తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
భారీ వర్షాలు, మేఘ విస్ఫోటాలు, కొండచరియలు విరిగిపడుతుండటం వల్ల జరుగుతున్న విషాదాలను.. సరైన విధానాలతో, ముందుచూపుతో వ్యవహరించినప్పుడే అరికట్టగలమని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న వేడి ఈ బీభత్సాలకు కారణభూతమవుతున్నా పర్వత ప్రాంతాల్లో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరం ఉంది.