16-07-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జులై 15 (విజయక్రాంతి): తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు, విద్యార్థుల మరణాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సర కాలంలో వెయ్యికి పైగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు నమోదు కాగా.. 100 మందికి పైగా విద్యార్థులు మరణించడానికి రాష్ర్ట ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే కారణమని కేటీఆర్ మండిపడ్డారు.
గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాలకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇన్ని ఘటనలు జరిగినా విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి కనీసం ఒక సమీక్ష కూడా చేయకపోవడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు. తన పిల్లలకు ఆహారం బదులు రాష్ర్ట ప్రభుత్వమే విషం పెడితే సీఎం ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
ఈ అంశంపై సీఎం ఇప్పటికైనా దృష్టి పెట్టాలని ఇద్దరు పిల్లల తండ్రిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి గతంలో అన్నట్లు విద్యార్థుల మరణాలకు ఎవర్ని బాధ్యులు చేస్తారు, ఎవరెవరినీ ఉరితీస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్, మరణాల అంశంపై గతంలో బీఆర్‌ఎస్ తరఫున ప్రభుత్వ దృష్టికి అనేకసార్లు తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు. రాష్ర్ట ప్రభుత్వం మొద్దునిద్ర వదిలి గురుకుల హాస్టల్స్ లో జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్టవేయాలని లేదంటే తమ పోరాటం ఉధృతం చేస్తామన్నారు.