వాణిజ్య పంటలవైపు రైతుల చూపు?
- 2,24,245 ఎకరాల్లో పంటలు సాగు
- తెల్ల బంగారానికి పెరుగుతున్న డిమాండ్
- అత్యధికంగా1,95,454 ఎకరాల్లో పత్తి
- కేవలం 1173 ఎకరాల్లో మినుము
- సంగారెడ్డి జిల్లాలో తగ్గిన చిరుధాన్యాల సాగు
సంగారెడ్డి, ఆగస్టు 18 (విజయ క్రాంతి) : పరిస్థితులకు అనుగుణంగా వాణిజ్య పంట ల సాగు వైపు రైతులు మరలుతున్నారు. మార్కెట్లో ధర ఉన్న పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిరుధాన్యాల కు, ఆహార ధాన్యాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు వానాకాలంలో ఎక్కువ గా పత్తి పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వానాకాలంలో 2,24,245 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. 1,95,454 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 9825 ఎకరాల్లో కంది, 9951 ఎకరాల్లో సోయాబీన్, 1437 ఎకరాల్లో పెసర, 1173 ఎకరాల్లో మినుము సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 2612 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారని అంచనా వేశారు.
తెల్ల బంగారం వైపు రైతులు
జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్, సంగారెడ్డి, పటాన్‌చెరు ని యోజకవర్గలో రైతులు గతంలో పాత పం టలైన జొన్న, పెసరా, మినుము, కందితో పాటు పలు పంటలు సాగు చేసే వారు. ప్ర స్తుతం మార్కెట్‌లో చిరుధాన్యాల పంటలకు మద్దతు ధర, గిట్టుబాట ధర లేకపోవడంతో రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. చిన్న, సన్న కారు రైతులు కేవం ఇంటి అవసరాల కోసం మాత్రమే చిరుధాన్యాలను పండించుకుంటున్నారు. పెద్ద రైతులు ఎక్కువగా పత్తితో పాటు చెరకు, బొప్పాయి, అల్లం, పసుపు, కూరగాయలు సాగు చేస్తున్నారు. వానాకాలంలో గతేడాది కంటే పాత పంటల సాగు తగ్గిపోయింది. రైతు నుంచి పంటలు కొన్న తరువాత పప్పులు, జొన్నల ధరలు భారీగా పెంచుతున్నారని తెలిపారు.
పంట ఖర్చుకు తగినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది చిరుధాన్యాలకు మద్దతు ధర పెంచడం లేదని రైతులు తెలిపారు. దీంతో పత్తికి మార్కెట్‌లో మంచి ధర ఉండడం, అమ్ముకోవడానికి పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. పత్తి సాగు పెరిగిపోవడంతో ఆహార భద్రత కొరత వచ్చే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, ప్రాజెక్టులు ఉన్న ప్రాంతంలో రైతులు వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది వానలు లేకపోవడంతో వరి సాగు తగ్గిపోయింది. ప్రభుత్వం చిరుధాన్యాలు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.






