14-11-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావా వెనక్కి తీసుకున్నారు. నాగార్జున కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులపై చేసిన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో పరువు నష్టందావాను వెనక్కి తీసుకున్నారు. కొంతకాలం క్రితం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో మంత్రి కొండా సురేఖ.. నాగచైతన్య, -సమంత విడాకుల అం శాన్ని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు తమ కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కొండా సురేఖపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు గురువారం విచారణకు రానున్న నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ ఖాతా ద్వారా నాగార్జునకు, ఆయన కుటుంబానికి క్షమాపణలు చెప్పా రు. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, నాగార్జున గారిని గానీ, ఆయన కుటుంబాన్ని గానీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే క్షమించాలని విన్నవించారు.
తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని కొండా సురే ఖ తన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో నాగార్జున సానుకూలంగా స్పందిం చారు. బుధవారం కోర్టు విచారణ ప్రారం భం కాగానే కేసును ఉపసంహరించుకుంటున్నట్లు నాగార్జున తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి ప్రజాప్రతి నిధుల కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. నాగార్జున కేసును ఉపసంహరించుకోవడంతో, ఈ వివాదం ముగిసినట్లేనని అంతా భావిస్తున్నారు. తదుపరి విచారణలో కోర్టు దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.