12-07-2024 02:57:08 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగి స్తోంది. ‘గ్రేటర్’ వాసులను పట్టిపీడిస్తోంది. మహానగరంలో క్రమ క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. బాధితులు ఇప్పటికే మలక్‌పేట (ఏరియా), నల్లకుంట (ఫీవర్), గాంధీ, ఉస్మానియా, బస్తీ దవాఖానలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకూ క్యూ కడుతున్నారు. దవాఖానలన్నీ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. రెండు వారాల నుంచి దవాఖానల్లో ఓపీ గణనీయంగా పెరుగుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
జ్వర పీడితుల్లో చిన్నారులు, వృద్ధులు ఉండ టం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గనివారు వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యు లు సూచిస్తున్నారు. లేకపోతే విష జ్వరాలతో పాటు డెంగ్యూ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. డెంగ్యూ బాధితు లు రెండు వారాల పాటు బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే గ్రేటర్‌లో ఈ ఏడాది జూన్ వరకు తక్కువగానే డెంగ్యూ కేసులు నమోదయ్యాయని జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం వెల్లడించింది. ఈ నెలతో పాటు వచ్చే నెలల్లో డెంగ్యూ విజృంభించే అవకాశ ఉంద ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
వైద్యుల సూచనలివీ..
డెంగ్యూతో పాటు విష జ్వరాలు దరిచేరకూడదంటే ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షం కురిసినపుడు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పాత వాటర్ ట్యాంకులు, పూల కుండీలు, టైర్లలో నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. మురుగు, పాకురు తొలగించేందుకు బ్లీచింగ్ పౌడర్ వినియోగించాలి. నీరు నిలిచిన ప్రాంతాల్లో దోమ లార్వాలు ఎదగకుండా ఆయిల్ బాల్స్ వేయాలి. ఇంట్లో దోమ తెరలు, కాయిల్స్ వంటివి వాడాలి. సాయంత్రం కిటికీలు, తలుపులు మూసివేయాలి. బయట ఫుడ్ తీసుకోకూడదు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.
మంచంపట్టిన కన్నెకల్లు!
నల్లగొండ, జూలై 11 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కన్నెకల్లు గ్రామంలో విష జ్వరాలు ప్రబలాయి. గ్రామానికి చెందిన 40 మందికిపైగా జ్వరంతో బాధపడుతూ మంచం పట్టారు. తీవ్రమైన కీళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో కదలలేని పరిస్థితుల్లో ఉన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఫిబ్రవరిలోనూ ఇదే తరహా జ్వరాలతో మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల, నిడమనూరు మండలంలోని పార్వతీపురం, వేములపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు అల్లాడి పోయారు.
ఏకంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు రంగంలోకి దిగినా జ్వరాలు ప్రబలడానికి సరైన కారణాలను విశ్లేషించలేక చేతులెత్తేశారు. వ్యాధి లక్షణాల ఆధారంగా మందులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బాధితులు ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి లక్షల్లో ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే ఆయా గ్రామాల్లో జ్వరాల బారినపడిన బాధితులు పూర్తిగా కోలుకుంటున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
ఈ రెండు నెలల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జ్వరం, ఒళ్లు నొప్పు లు, జలుబు, గొంతునొప్పి తదితర సమస్యలతో బాధపడే వారు అలసత్వాన్ని వీడాలి. వీలైనంతా త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. డెంగ్యూ ఫీవర్ నిర్ధారణ అయితే వారం నుంచి రెండు వారాల పాటు బయటకు రాకుండా చికిత్స తీసుకోవాలి. వైద్యు లు సూచనలను తప్పకుండా పాటించాలి. అరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలి.
డాక్టర్ అనిల్, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి
ప్రస్తుతం నమోదవుతున్న ఓపీ..
దవాఖాన రోజువారీ ఓపీ
ఉస్మానియా 2,900- 3,300
గాంధీ 3,000- 3,500
నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి 500- 600
మలక్‌పేట ఏరియా ఆసుపత్రి 700- 800
కేసులు గతేడాది,
ఈ ఏడాదితో పోలిస్తే..
నెల 2023 2024
ఏప్రిల్ 53 52
మే 58 43
జూన్ 133 91