calender_icon.png 13 July, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాకు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు రాక

12-07-2025 04:51:48 PM

- అధికారులు అప్రమత్తంగా ఉండాలి 

-  కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాకు ఈ నెల 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka), రాష్ట్ర ఆబ్కారీ, మద్యనిషేధ, పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనరసింహల పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) కోరారు. శనివారం కలెక్టరేట్ లో డిసిపి ఎగ్గడి భాస్కర్ తో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారని, అధికారులు పూర్తి ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలన్నారు.

ఉదయం 11.10 గంటలకు లక్షేట్టిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారని, మధ్యాహ్నం 12 గంటలకు అధికారులు, అనధికారులతో సమావేశమై 12.10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి భోజనం చేస్తారని, మధ్యాహ్నం 2 గంటలకు దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సోలార్ ప్రాజెక్టు (పైలెట్ ప్రాజెక్టు)కు శంఖుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొంటారని, 3.15 గంటలకు హాజీపూర్ మండలం గుడిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారని తెలిపారు.

సాయంత్రం 4 గంటలకు హాజీపూర్ మండలం వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ శంఖుస్థాపన చేసి ప్రజలతో మాట్లాడతారన్నారు. 4.15 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మాత శిశు కేంద్రాన్ని సందర్శిస్తారని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రముఖుల బందోబస్తు ఏర్పాట్లు, మంచిర్యాల ఆర్డీవో కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రహదారులు, గ్రామీణ రహదారుల మరమ్మత్తులు, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల అభివృద్ధి, వేదిక, మైక్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. టి.జి.ఎం.ఐ.డి.సి. ఆధ్వర్యంలో నిర్మాణ పనుల పర్యవేక్షణ, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, టి.జి.ఐ.ఐ.సి. జోన్ మేనేజర్ పరిశ్రమల సమన్వయం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, శంకుస్థాపన సంబంధిత ఏర్పాట్లు, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల తహసిల్దార్లు బృందంగా పని చేసి వాహనాల పార్కింగ్ స్థలంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

ఆయా మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు 15 నుంచి 30 వరకు నీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలని కోరారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని, అగ్ని నిరోధకాలు, ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆబ్కారీ, మధ్య నిషేధ శాఖ ఆధ్వర్యంలో నిబంధనలను అమలు చేయాలని, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది నిర్ణయించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, 2 అంబులెన్సులను కార్యక్రమం వద్ద అందుబాటులో ఉంచాలని, కార్డియాలజీ నిపుణునితో కూడిన ఒక అంబులెన్స్ ను కాన్వాయ్ లో ఉంచాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కలెక్టర్  సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులను కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాలని, వారికి అవసరమైన భోజన ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులను కోరారు.

ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో ఆహార నాణ్యత పరిశీలన, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ పథకాలు, వసతులను సమీక్షించాలని, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధుల సమన్వయం, విస్తృత ప్రచారం చేయాలని, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగర ప్రాంత శుభ్రత, అభివృద్ధి పనుల నిర్వహణ అంశాలను పర్యవేక్షించాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిరంతర విద్యుత్ సరఫరా, లైట్ల నిర్వహణ, రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రముఖుల వాహనాల ఏర్పాటు, ట్రాఫిక్ రూట్ మ్యాప్ రూపొందించాలన్నారు. అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.